డబ్బు సంపాదించాలనే కోరిక ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు కష్టపడి పని చేస్తే మరికొందరు షార్ట్ కట్స్ ఫాలో అవుతుంటారు. ఇలా చేసిన వారు ఎవరైనా చిక్కుల్లో పడక తప్పదు. అసలే ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. అదే సంబంధాన్ని ఆసరాగా తీసుకోని తన ప్రియుడి స్నేహితులతో వ్యాపారం చేసింది. అందులోనూ మోసం బయటపడటంతో ఆమె ఊహించని ఘటనలు ఎదర్కోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని సీతారామపురంకు చెందిన మహిళ.. ఓ రైల్వే ఉద్యోగితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రియుడి ద్వారా పరిచయమైన రైల్వే ఉద్యోగులు, బంధువులకు తక్కువ ధరకు బంగారం ఇచచే వ్యాపారం చేస్తున్నారు. సవ్యంగా సాగుతున్న ఆమె వ్యాపారానికి సడెన్ గా బ్రేక్ పడింది.
పలువురి నుంచి ముందుగానే డబ్బులు తీసుకున్న ఆమె.. నాలుగు నెలల నుంచి బంగారం ఇవ్వడం లేదు. దీంతో డబ్బులిచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులడిగిన ప్రతిసారీ రేపు మాపు అంటూ దాటవేస్తుండటంతో వారిలో సుబ్బారావు అనే వ్యక్తి డబ్బుల కోసం మహిళతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగస్టు 31న రాత్రి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించి కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ సీతారాంపురానికి చేరుకుంది.
ఇదిలా ఉంటే ఆమెకు డబ్బులివ్వాల్సిన ఓ వ్యక్తి ఫోన్ చేసి 10వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ వద్దకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె మరో యువతితో కలిసి తెలిసిన వారి కారులో బయలుదేరారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ జరిగిందంటూ కారు నెంబర్ తో సహా పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సిటీ అంతా జల్లెడపట్టిన పోలీసులు సినిమా స్టైల్లో కారును అడ్డుకోని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళ ఇచ్చిన సమాచారంతో ఆమెపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఐతే మహిళ మోసం చేసినట్లు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని.. వస్తే కేసు నమోదు చేస్తామని సూర్యారావుపేట పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రూ.5 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం విజయవాడ రైల్వే ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది.
మహిళకు డబ్బు చెల్లించిన వారిలో చాలా మంది రైల్వే ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. ఐతే ఆమె తక్కువ ధరకు బంగారం ఎలా ఇస్తుంది..? అది నిజంగా ఒరిజనల్ గోల్డేనా..? అనేది తెలియకుండా డబ్బులు ఎలా చెల్లించారనేది చర్చనీయాంశమైంది. ఐతే ఇప్పటికే కొంతమందికి బంగారం ఇవ్వడంతో అది ఎక్కడి నుంచి వస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Extramarital affairs, Kidnap, Vijayawada