• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA KANAKADURGA TEMPLE WEBSITE STOPPED AND DEVOTEES FACING PROBLEMS IN ANDHRA PRADESH FULL DETAILS PRN

Kanakadurga Temple: దుర్గమ్మ భక్తులకు షాక్.. ఆన్ లైన్ సేవలకు బ్రేక్.. అధికారుల రియాక్షన్ ఇదే..

విజయవాడ దుర్గగుడి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ (Vijayawada) కనకదుర్గమ్మ అమ్మవారి (Kanakadurga Temple) ఆలయ వెబ్ సైట్ నిలిచిపోయింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ వెబ్ సైట్ నిలిచిపోయింది. అమ్మవారి దర్శనం టికెట్లు, ఇతర సమాచారం కోసం అందుబాటులో ఉండే ఈ వెబ్ సైట్ నిలిచిపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. kanakadurgamma.org వైబ్ సైట్ ను అధికారులు ఉన్నట్లుండి నిలిపేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో టికెట్ల గోల్ మాల్ వ్యవహారం వల్లే వెబ్ సైట్ నిలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానంలో ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న వెబ్ సైట్ ద్వారా దర్శనం టికెట్లలో అవకతవకలు జరిగాయి. దీంతో గత నెలలో జరిగిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నిర్వహాణపై ప్రదాన చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించే వెబ్ సైట్లను నిలిపేయాలని ఆదేశించారు.

    ఐతే ఆదేశాలు జారీ చేసి నెలరోజులు గడుస్తున్నా దుర్గగుడి వెబ్ సైట్ నిలిపివేయకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వెబ్ సైట్ సేవలు నిలిపేశారు. ఐతే ముందస్తు సమాచారం లేకుండా వెబ్ సైట్ నిలిపేయడంతో భక్తులు ఆందోళన చెందారు. ముఖ్యంగా దర్శనం, ఇతర ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    2017లో దుర్గగుడి వెబ్ సైట్ రూపొందించే బాధ్యతను అప్పటి ఈవో సూర్యకుమారి విశాఖపట్నంకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి అదే సంస్థ అమ్మవారి దేవస్థానంలోని దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, ఆన్ లైన్ డొనేషన్లకు సంబంధించిన సేవలను అందిస్తోంది. అలాగే కరొనా సమయంలోనూ సదరు సంస్థ దేవస్థానానికి ఉచిత సేవలు అందించింది. ఐతే ప్రస్తుతం దేవాదాయ శాఖ ఇటీవల తీసుకొచ్చిన టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారానే భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ నేపథయంలోనే వెబ్ సైట్లను నిలిపేసినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం టీఎంఎస్ ద్వారా ఆలయాల వద్ద మాత్రమే దర్శనం, ఆర్జిత సేవలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి ఆన్ లైన్ టికెట్ల జారీ, డొనేషన్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వెబ్ సైట్ నిలిపేయడంతో ఆలయ ఆదాయంపైన ప్రభావం పడుతోంది. దుర్గమ ఆలయానికి రోజుకు దాదాపు రూ.20లక్షల ఆదాయం వస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఆదాయంపై గండిపడుతోంది. దుర్గగుడి అధికారులు మాత్రం దేవాదాయ శాఖ ఆదేశాలతోనే వెబ్ సైట్ నిలిపేశామని.. మరో వారం రోడుల్లో టీఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఐతే ఇది ఖచ్చితంగా వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందా.. లేక మరింత కాలం పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు.
    Published by:Purna Chandra
    First published: