Vijayawada: విజయవాడ దుర్గగుడి బడ్జెట్‌ ఎంతో తెలుసా? రైలు పేరు కనకదుర్గా ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని డిమాండ్

విజయవాడ దుర్గ గుడి

విజయవాడ కనకదుర్గ ఆయల పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి భారీగా బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ప్రధాన జంక్షన్లలో ముఖ ద్వారాల నిర్మాణంతో పాటు.. విజయవాడ మీదుగా వెళ్లే ఏదో ఒక రైలుకు కనకదుర్గ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చాలని రైల్వే శాఖను కోరాలని నిర్ణయించింది.

  • Share this:
    జెజవాడ కనకదుర్గమ్మ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది 178 కోట్ల రూపాయలతో దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి బడ్జెట్ కేటాయించారు. ఈ సమావేశంలో 38 అంశాలకు గానూ 36 అంశాలను ఆమోదించినట్టు దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడు  వెల్లడించారు. ఇక నుంచి ప్రతి నెల మూడొ వారంలో పాలక మండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అలాగే బెజవాడలోని ముఖ్య జంక్షన్ లలో దేవస్థానం తరపున ఆర్చ్‌లు నిర్మించాలని.. అవి కూడా అత్యాధునిక డిజైన్లతో ఉండాలే చూడాలని పాలకమండలి ఆమోదించినట్టు సోమినాయుడు తెలిపారు. అలాగే విజయవాడ మీదుగా వెళ్లే ఏదైనా ఒక ట్రైనుకు కనకదుర్గా ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని రైల్వే శాఖను కోరుతామన్నారు. దీనిపై సానుకూల నిర్ణయం  వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ప్రస్తుతం కరోనా కేసులు విస్తరిస్తుండడంతో.. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే రోజుకు 5వేల మందికి అన్నదానం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలు టెండర్లను ఆమోదించినట్టు పైలా సోమినాయుడు తెలిపారు. ఈ ఏడాది ఆర్దిక బడ్జెట్ రూపకల్పనతోపాటు ఇతర అంశాలను అజెండాలో పొందుపరిచారు. గతేడాది కొవిడ్‌ పరిస్థితుల కారణంగా బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండానే.. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసర బడ్జెట్‌ కింద ఖర్చు పెట్టారు. కరోనా పరిస్థితుల్లో దేవస్థానానికి ఆదాయం లేకపోగా ఖర్చు గణనీయంగా పెరిగింది. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల విషయంతోపాటు భద్రతా ప్రమాణాల దృష్ట్యా.. ఎక్కువ మొత్తం ఖర్చు చేసింది. ఈ ఏడాది దేవస్థానం సుమారు 122 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ రూపొందించి. రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అభివృద్ధికి.. 70 కోట్ల రూపాయల కేటాయింపుతో కలిపి మొత్తం బడ్జెట్‌ 192 కోట్లకు చేరుకుంటుందని పాలక మండలి అంచనా వేసింది.

    అయితే ఇటీవల బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అవినీతిపై ఏసీబీ సోదాలతో ఈ పాలకమండలి సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది. ఇటీవల ఏసీబీ విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు కొండపై సోదాలు జరిపిన ఏసీబీ సోదాల్లో అనేక అవకతవకలు గుర్తించినట్టు ప్రచారం జరిగింది. ప్రతి దాంట్లోనూ అవినీతి చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. శానిటైజేషన్ కాంట్రాక్టులు, సెక్యూరిటీ సిబ్బంది టెండర్లు, స్టోర్స్ లో సరుకుల కొనుగోళ్లు, అమ్మవారి చీరలు అమ్మకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ తేల్చింది. అయితే పాలకమండలి సమావేశంలో అవినీతిపై ఎలాంటి చర్చ జరిగలేదని తెలుస్తోంది. కేవలం బడ్జెట్ ఆమోదించుకోడానికి మాత్రమే ఈ పాలకమండలి పరిమితమైనట్టు సమాచారం.
    Published by:Nagesh Paina
    First published: