ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కృష్ణాజిల్లాకు ప్రత్యేక స్థానముంది. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా ఏదంటే కృష్ణాజిల్లా (Krishna District) పేరే గుర్తుకు వస్తుంది. ఇక్కడి ఓటర్లు ప్రతిసారీ ఒకేపార్టీకి పట్టం కట్టే పరిస్థితి లేదు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఓటర్లు మొగ్గుచూపుతుంటారు. 2014లో టీడీపీ వైపు నిలబడ్డ జిల్లా ఓటర్లు.. 2019లో వైసీపికి మొగ్గు చూపారు. ఐతే మొదట్నుంచి జిల్లాపై కాస్త పట్టున్న టీడీపీ (TDP)కి గత ఎన్నికల్లో ఊహించని షాక్ తప్పలేదు. జిల్లా రాజకీయం ఒక ఎత్తైతే.. విజయవాడ (Vijayawada) పాలిటిక్స్ మరో ఎత్తు. ఒకప్పుడు ఇక్కడ వంగవీటి వర్సెస్ దేవినేని అనేలా రాజకీయాలు జరిగాయి. గత రెండున్నర దశాబ్దాలుగా ఆ వేడి కాస్త చల్లారిందనే చెప్పాలి. కానీ మరోసారి పోరు ఈ రెండు వర్గాల మధ్య మొదలుకాబోతోంది. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి కేవలం 2సీట్లు మాత్రమే వచ్చాయి. విజయవాడ ఈస్ట్, గన్నవరంలో పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఐతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టగా.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన్ను వంశీకి పోటీగా గన్నవరం పంపి.. వంగవీటి రాధాను విజయవాడ ఈస్ట్ నుంచి బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ ఛార్జ్ గా దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాధా టీడీపీ తరపున బరిలో దిగితే బెజవాడ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. గతంలో 2004 నుంచి 2009 వరకు వంగవీటి రాధా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 ప్రజారాజ్యం తరపున సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ఈస్ట్ వైసీపీ తరపున ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సెంట్రల్ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నా టికెట్ పై హామీ లేకపోవడంతో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ రాధా పోటీ చేయలేదు. ప్రస్తుతం మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్న రాధా.. 2024లో ఈస్ట్ నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే ఈ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Devineni avinash, Vangaveeti Radha, Vijayawada