K Sai Trinath, News18, Vijayawada
ఈ రోజుల్లో తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు ఆకర్షణకు గురవుతున్నారు. అలా ఆకర్షణలో చేసిన తప్పులు వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అలా ఓ విద్యార్థిని వేసిన తప్పటడుగు తీవ్రపరిణామాలకు దారితీసింది. ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడం విజయవాడ (Vijayawada) లో కలకలం రేపింది. విజయవాడ నగర శివారులోని పెనమలూరు ప్రాంతంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష రాయటానికి ఏలూరుకు చెందిన 17ఏళ్ల విద్యార్థిని కళాశాల ఆవరణలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన బిడ్డను అక్కడే వదిలేసి, విద్యార్థిని ఎంసెట్ పరీక్షను రాసేందుకు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళింది.
క్యాంపస్ లోనే ఆమెకు నొప్పులు రావడంతో తోటి విద్యార్థినులు సపర్యలు చేశారు. ఆమె అక్కడే బిడ్డను ప్రసవించగా ఎండవేడికి పసికందు మృతి చెందింది. పరీక్ష రాసిన అనంతరం విద్యార్థినికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏలూరుకు చెందిన బాలిక తల్లిదండ్రులు విడిపోవడంతో ప్రస్తుతం తల్లిదగ్గరే ఉంటోంది. స్థానికంగా ఓ షోరూమ్ లో పనిచేస్తోంది. గర్భం దాలిచన సంగతిని ఆమె తల్లికి కూడా చెప్పలేదని పోలీసులు వివరించారు.
దీనిపై పెనమలూరు పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. అనంతరం ఏలూరు వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను గర్భవతిని చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradeh, Local News, Vijayawada