Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్లు అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సరిగా ఉండదని.. ప్రాక్టికల్ నాలెజ్డ్తో కూడిన నాణ్యమైన విద్య ఉండదని, ముఖ్యంగా టీచర్లు సరిగా స్కూల్‌కు రారని చాలామంది అనుకుంటారు. అదే ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే తమ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్ (English) లో మాట్లడతారు అని లక్షలకు లక్షలు పోసి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపిస్తుంటారు. అయితే, ఇవన్నీ ఒకప్పటి మాటలు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ పాఠశాల (AP Government Schools) ల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దగ్గర నుంచి అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. అంతేకాదు పిల్లలు సైతం అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడం రాదు అనే వాళ్లందరూ ఆశ్చర్యపోయేలా.. ఫారిన్ యాక్సెంట్లో ఇంగ్లీష్‌లో అనర్గళంగా ఇరగదీస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా (NTR District) విజయవాడ (Vijayawada) రూరల్ మండలం నిడమానూరు పాఠశాల విద్యార్థులు. ఫర్హీన్ అనే విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎవ్వరైనా అలానే వింటూ ఉండిపోతారు. ఆ యాక్సెంగ్ విన్నవాళ్లెవరైనా సరే ఎవరో అమెరికన్ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఇలా ఒక్క ఫర్హీన్ మాత్రమే కాదు ఆ స్కూల్లో చాలామంది పిల్లలు ఇంగ్లీషులో దంచికొడుతున్నారు. మరికొందరు అమెరికన్ యాక్సెంట్లో ఇరగదీస్తున్నారు.
ప్రస్తుతం ఇంగ్లీష్‌లో ముఖ్యంగా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడే పిల్లలని చూసి తెలుగు మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు ఉపాధ్యాయలు రమేష్ బాబు తెలిపారు. నిడమానూరు స్కూల్లో ఇంగ్లీష్ ఆసక్తి ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నామని రమేష్ బాబు చెబుతున్నారు.
ప్రభుత్వ రంగ పాఠశాలలో చదువులు అంత అంత మాత్రం అనే రోజులు పోయి… చదివితే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అనేలా స్కూళ్లను అభివృధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే స్కూళ్లలో ఇంగ్లీష్ క్లాసులు బోధిస్తున్నారు. పిల్లలు కూడా తమకు వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుంటూ కొద్దిరోజుల ట్రైనింగ్‌లోనే ఇంగ్లీష్‌ను అదరగొడుతున్నారు.
ఈ ఒక్క నిడమానూరు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా విద్యార్థులు ఇంగ్లీష్‌ను మడతపెట్టేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ మధ్య బెండపూడి విద్యార్థులు మాట్లాడిన యాక్సెంట్ ఫుల్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం వాళ్ల యాక్సెంట్ చూసి మెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంతబాగా ఇంగ్లీష్ మాట్లాడతారా అని అందరూ అబ్బురపోయారు.
ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు. మరికొన్ని స్కూళ్లలో పిల్లలకు ప్రత్యేకంగా యాక్సెంట్ కూడా నేర్పిస్తున్నారు. అలానే తెలుగు మీడియం స్కూల్ విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తే ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కూడా మారుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాద్యాయులు కోరుకుంటున్నారు.
అడ్రస్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నిడమానూరు, విజయవాడ రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్- 521104.
ఎలా వెళ్లాలి..?
విజయవాడ నుంచి నిడమానూరుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. నిడమానూరులో ప్రభుత్వ పాఠశాల అని అడిగినే ఎవ్వరైనా చెబుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada