Golden Bonam: బోనాల పండుగ (Bonalu Festival) అంటే తెలంగాణ (Telangana)లో జరిగే ఆ సంబరాలే వేరు. తెలంగాణలో బోనాల పండగకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. అమ్మారికి భోనాల సమర్పణ, పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు, డీజే ఆటపాటలతో సందడే.. సందడి కనిపిస్తుంది. కానీ గత రెండేళ్లూ కరోనా కారణంగా నిరాడంబరంగానే పండగ జరిగింది. కానీ ఈసారి ఘనంగా పండగను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ లో పండగా జాతరలా సాగుతోంది. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. బోనం (Bonam ) అనేది భోజనం అనే పదానికి వికృతి. తమ బిడ్డల్ని, కుటుంబ సభ్యులని మాత్రమే కాకుండా ఊరుమొత్తం చల్లంగ చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి భక్తితో బోనం సమర్పిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదనేం... తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్రజలు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. తమ ఇంటికి ఎలాంటి ఆపదా రాకుండా, ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ అమ్మతల్లిని తల్చుకుంటారు. మరి అలాంటి గ్రామదేవతలను ఘనంగా కొల్చుకునేందుకు ఓ సందర్భమే.. బోనాలు. ప్రతి ఏటా తెలంగాణ బోనాలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ నిర్వహిస్తున్నారు. 2010 నుంచి ఈ వేడుకలు జరుపుతున్నారు.
ఆషాడమాసంలో భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ బోనాలు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి కూడా విజయవాడలో బోనాల పండగ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ (Hyderabad)లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ పేర్కొన్నారు. తెలంగాణలో బోనాలకు ఏపీలోనూ గుర్తింపు ఉందని.. చాలామంది ఏపీ ప్రజలు సైతం ఈ బోనాల్లో పాల్గొంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల విడిపియినా ఇలా సోదరభావంతో ఉండడానికి ఇలాంటి పండుగలే కారణం అంటున్నారు.
ఇక ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు దగ్గర అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన తరువాత బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Telangana Bonalu, Vijayawada