Prayaga Raghavendra Kiran, Vijayawada, News18.
Homeless: పేదరికంలో పుట్టడం వీరు చేసిన పాపమా.. శాపమా .. ముప్పై ఏళ్లుగా ప్లాట్ ఫామ్ మీదే జీవనం సాగిస్తున్నారు ఓ వృద్ధ జంట. ఆకలేస్తే ఆకాశం వైపు దాహం వేస్తే నేల వైపు చూస్తూ… ఎండకి ఎండుతూ..వానకు తడుస్తూ పగలు ,రాత్రి తేడా లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఇంతలా కష్టపడుతున్నా…దేవుడికి వీరిపై కరుణ కలుగకపోగా…ఇంకాస్త కష్టాల సుడిగుండంలోకి నెట్టాడు. కూతురు, అల్లుడు అకాల మరణంతో మనవరాళ్లు రోడ్డునపడ్డారు. ఇప్పుడు వారి భాద్యతను కూడా వీరే చూసుకుంటున్నారు. ఈ దయానీయ గాథ ఎక్కడో కాదు.. విజయవాడ (Viajayawada)లో.. రోడ్డుపైకి వెళ్తున్న ఎందరినో వీరి కష్టాలు మనసును కలిచివేసేలా దర్శనమిస్తూ ఉంటాయి. ఎంతో సుందర నగరం ,కానీ వాడ వాడలా నిరాశ్రయుల సంఖ్య అధికం.
విజయనగరం (Vijayanagaram) పట్టణనానికి చెందిన పార్వతీ (Parvathi ), రమణ (Ramana) లు.. 30 ఏళ్ల నుంచి విజయవాడ సత్యనారాయణపురంలోని ఏలూరు కాలువ పక్కన రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నారు. అసలే కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ… జీవనం సాగిస్తుoటే విధి వైపరీత్యమో , కాలం కాటేసిందో ! కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో కూతురు , అల్లుడు చనిపోవడంతో… ముగ్గురు మనవరాలతో ఈ ప్లాట్ ఫమ్ పై జీవనం సాగిస్తున్నారు.
పార్వతి చిత్తు కాగితాలు ఏరుకుంటూ... నాలుగు పైసలు సంపాదిస్తుంటే.. తాత రమణ ఆ పిల్లలకు రక్షణగా ఉంటూ వస్తున్నారు. ఉండటానికి ఇల్లు లేక.. రోడ్డు పక్కనే బతుకును వెళ్లదీస్తున్నామని.. ఆడ పిల్లల మొహం చూసైనా.. తమకు ఓ ఇళ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
పార్వతి కుటుంబానికి రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ముగ్గురు ఆడ పిల్లల్లో ఇద్దరికి ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డులు లేవని బడిలో చేర్పించుకోవటం లేదని పిల్లలంటున్నారు. స్నానాలు కూడా పక్కనే కాలువలో రాత్రి సమయంలో చేయాల్సిన దుస్థితిలో ఉన్నామంటున్నారు. తమకు ఇల్లు కట్టించి, బడిలో చేర్పిస్తే బాగా చదువుకుంటామని పిల్లలు వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Vijayawada