Vijayawada Fire Mishap : విజయవాడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి... ఫైర్ సేఫ్టీ చర్యలేవి?

Vijayawada Fire Mishap : విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు అగ్ని ప్రమాద నివారణ చర్యలేవీ తీసుకోలేదని తెలిసింది.

news18-telugu
Updated: August 9, 2020, 11:14 AM IST
Vijayawada Fire Mishap : విజయవాడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి... ఫైర్ సేఫ్టీ చర్యలేవి?
Vijayawada Fire Mishap : విజయవాడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి... ఫైర్ సేఫ్టీ చర్యలేవి?
  • Share this:
Vijayawada Fire Mishap : ఎక్కడైనా ఏదైనా భవనం నిర్మిస్తే... దానికి అన్ని రకాల అనుమతులూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అగ్నిమాపక విభాగం నుంచి అనుమతి పత్రం కూడా తీసుకోవాలి. అలా అనుమతి లేని భవనాల్ని నిర్మించడానికి వీలుండదు. కానీ మన దేశంలో ఎన్నో భవనాలకు ఫైర్ సేఫ్టీ సరిగా ఉండట్లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే... వెంటనే ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి సరైన సదుపాయాలు, పరికరాలూ ఉండట్లేదు. అలాంటి భవనమే... తాజాగా విజయవాడలో అగ్నిప్రమాదం జరిగిన కొవిడ్ కేర్ సెంటర్. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్‌ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వాడుతోంది. ఈ భవనంలో 30 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది దాకా డాక్టర్లు, ఇతర హెల్త్ సిబ్బంది ఉన్నారు. ఇలాంటి భవనంలో ఉన్నట్టుండి... గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 5 గంటల సమయంలో దట్టమైన పొగలు, మంటలు వచ్చాయి. దాంతో ఆస్పత్రిలో ఉన్న కరోనా పేషెంట్లకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. వారంతా కిటికీల దగ్గరకు వచ్చి కేకలు వేశారు. తీవ్ర ఆందోళన చెందారు. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతూ... దాదాపు భవనాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలో... ఫైర్ సిబ్బంది వచ్చి ఏడు ఫైరింజన్లతో... 2 గంటల పాటూ కష్టపడి మంటల్ని అదుపు చేశారు. ఆ తర్వాత... రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. ఆస్పత్రిలోని వారిని వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. తీవ్రంగా ఊపిరాడక ఇబ్బంది పడిన 11 మంది ఈ ఆపరేషన్‌ సమయంలో, వేరే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.


ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి... బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతే... జగన్‌కు కాల్ చేసి... ఈ ఘటనపై ఆరా తీశారు.

ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బందితోపాటూ... NDRF బృందాలు... భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించనందుకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఏపీ డీజీపీ... గౌతమ్ సవాంగ్... ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎంక్వైరీ చేసి... ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు.

ఐదు అంతస్థుల స్వర్ణా ప్యాలెస్ హోటల్‌ను నిర్మించినప్పుడు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నది మొదటి ప్రశ్న. ఆ హోటల్‌ను కొవిడ్ కేర్ కేంద్రంగా మార్చినప్పుడు... అప్పుడైనా ఫైర్ సేఫ్టీ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది మరో తేలాల్సిన ప్రశ్న. అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఫలితంగా 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కరోనా మరణాలకు తోడు ఇలాంటి విషాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన కన్నీటిని మిగుల్చుతున్నాయి.

అధికారులు కూడా అప్పుడప్పుడూ ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి హోటళ్ల లైసెన్సులు రద్దు చేసి... భవనాల్ని కూల్చివేయడమే కరెక్టు. చట్ట వ్యతిరేకంగా నిర్మించిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే. అప్పుడే ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయంటున్నారు ప్రజలు.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading