• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA FIR FILED AGAINST MP RAGHURAMA KRISHNAM RAJU AND CID MADE ALLEGATIONS CONSPIRACY BEHIND RAGHURAMA COMMENTS ON ANDHRA PRADESH GOVERNMENT FULL DETAILS HERE PRN GNT

Raghurama Krishnam Raju Case: రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ ఎఫ్ఐఆర్ ఇదే… ఏ-2, ఏ-3 ఎవరంటే..!

రఘురామ కృష్ణంరాజు(ఫైల్ ఫొటో)

ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Share this:
    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అదికారులు రఘురామ కృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారం ఆయనపై FIR 12/2021 నమోదు చేసిన అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. రఘురామకృష్ణం రాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ అందులో A1గా రఘురామకృష్ణంరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానళ్లను పేర్కొన్నాయి. సిఐడి డిఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణంరాజుపై అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన సిఐడి.. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలున్నాయని.. అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సీఐడీ స్పష్టం చేసింది. అలాగే కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని రఘురామ కృష్ణంరాజు వ్యవహరించారని పేర్కొంది.

    TV5, ABN ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొన్న సీఐడీ.. ఆయన కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించారని ఆరోపించింది. రఘురామ కృష్ణంరాజుతో కలిసి ప్రభుత్వం టీవీ ఛానళ్ల విషం చిమ్మాయని... అలాగ పక్కా పథకం ప్రకారమే రఘురామ కృష్ణంరాజు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అభియోగాలు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రఘురామ రాజు కుట్ర చేశారని పేర్కొంది.

    ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ ఎఫ్ఐఆర్


    ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ ఎఫ్ఐఆర్


    శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని రఘురామకృష్ణంరాజు నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అక్కడే అదుపులోకి తీసుకొని మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రాత్రంతా అయన్ను వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని బెయిల్ మంజూరుచేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.

    2019లో నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా విజయం సాధించిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు.. గత కొంతకాలంగా ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్, ఇతర ముఖ్యనేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రతి రోజూ రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. మూడు రాజధానులు, ఇసుక పాలసీ, మద్యపాన నిషేధం, కరోనా నియంత్రణ, ప్రభుత్వ సలహాదారులు ఇలా అన్ని అంశాల్లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

    ఇదిలా ఉంటే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ప్రాణానికి హాని ఉందని.., కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని లోక్ సభ స్పీకర్, ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీంతో ఆయనకు కేంద్రం వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఐతే కేంద్ర బలగాలతో భద్రత కేటాయించినప్పటికీ ఆయన ఇటు ఏపీకి గానీ.., అటు హైదరాబాద్ కి గానీ రావడం లేదు. శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్నఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లి రఘురామ కృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published: