ఎవరైనా దగ్గర బంధువులు మరణిస్తే..నాలుగు రోజులు బాధపడతాం.. ఆ తర్వాత ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. మహా దశదిన కర్మరోజు లేదా వర్ధంతి రోజు ఫోటోకు దండవేసి నివాళులర్పిస్తారు. చనిపోయిన వారిని రక్తసంబంధీకులే మర్చిపోతున్న ఈ రోజుల్లో పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమను పెంచుకున్నాడో యజమాని. కుక్క చనిపోయి ఐదేళ్లయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. అంతేకాదు ఆ కుక్కకు విగ్రహం చేయించి పూజలు కూడా చేస్తున్నాడు. ఇదేం విడ్డూరంరా నాయనా అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు గతంలో ఓ కుక్కను పెంచుకున్నారు. అదంటే అయనకు పంచప్రాణాలు.. దానికి శునకరాజు అని పేరుపెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. సాటి మనిషిలా దానితో అనుబంధం పెంచుకున్నాడు. శునకరాజు కూడా.. జ్ఞానప్రకాశరావుపై ఎంతో విశ్వాసంతో ఉండేది. ఆయన చెప్పినదల్లా అర్ధం చేసుకునేది. కానీ ఐదేళ్ల క్రితం ఓ రోజు అనుకోకుండా పెంపుడు కుక్క శునకరాజు మరణించింది.
దీంతో ఆకుటుంబం అంతా బాధతో విలవిల్లాడిపోయింది. అప్పట్లో దానికి అంత్యక్రియలు కూడా చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దాని వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా ఈ తంతు కొనసాగుతూ వస్తోంది. ఐతే తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు కుటుంబం దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించింది. ఇంటి దగ్గరే విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని ఆత్మహకు శాంతి కలగాలంటూ పండితులను పిలిచి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి దీపారాధన చేయడంతో పాటు పిండప్రదానం కూడా చేశారు. అనంతరం బంధువులు, స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. జోరువానలో కూడా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చూసిన ఊళ్లోవాళ్లు అవాక్కయినా.. పెంపుడు కుక్కపై జ్ఞానప్రకాశరావుకు ఎంత ప్రేమ ఉందోనని చెప్పుకున్నారు కూడా.
తమ ప్రియమైన శునకరాజుకు నివాళులర్పిస్తూ ఆ కుటుంబం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించింది. ఎక్కువ రోజులు తమలో ఒకటిగా కలిసి జీవించిన శునకరాజు ఆత్మకు శాంతికలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా ఎట్రాక్షన్ గా మారాయి. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న శుకనకారాజు ఆత్మ శాంతించాలనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసినట్లు జ్ఞానప్రకాశరావు కుటుంబం చెప్తోంది. రక్త సంబంధం ఉన్నవారు చనిపోతేనే ఆస్తి గొడవులనో ఇంకే గొడవలనో కొంతమంది పట్టించుకోరు కానీ.. తమతో ఎంతో నమ్మకంగా ఉన్న కుక్క చనిపోతే ఆకుటుంబం మనిషికంటే ఎక్కువగా పూజలు, ఇతర కార్యక్రమాలు చేయడమే కాకుండా ఏకంగా విగ్రహం పెట్టడం కృష్ణాజిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Pet dog