Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
పోలీసులంటే నలుగురి మంచి చెప్పేవాళ్లు. తప్పు చేస్తే సరిదిద్దుతారు. మాట వినకుంటే లోపలేసి నాలుగు తగిలిస్తారు. కానీ వాళ్లే తప్పులు చేస్తే.. విమర్శలపాలవక తప్పదు. మాయమాయలు చెప్పి మోసం చేస్తే.. ఎలా ఉంటుంది..? తాగా ఓ ఎస్సై.. మహిళా హోంగార్డున మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) లో జరిగింది. బంటుమిల్లు ఎక్సైజ్ ఎస్సై కిషోర్... సొంత డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్న హోంగార్డ్‌తో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పడంతో హోంగార్డు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేవలం మోసం చేయడమే కాకుండా తన వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు పైగా డబ్బులు తీసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు గతంలో వివాహం జరిగి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సబ్‌జైల్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. ఆ తర్వాత తన స్టేషన్‌లోనే పనిచేస్తున్న ఈ కిషోర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త పెరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తనను వివాహం చేసుకుంటానని అన్ని తానై చూసుకుంటానని నమ్మించి పిల్లల బాధ్యత కూడా తనే చూస్తుంటానని చెప్పడంతో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. అంతేకాదు తన కుమార్తె వివాహ నిమిత్తం పొదుపు చేసుకున్న రూ.2.50 లక్షలు కిషోర్ ప్రమోషన్‌కు అవసరం అని తీసుకున్నాడు.
రోజులు గడుస్తున్నా పెళ్లి మాట అడిగితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల్లో తనకి ప్రమోషన్ వస్తుందని ఆ తరువాత వివాహం చేసుకుందామని నమ్మించి మోసం చేశాడు. బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటాడని నమ్మి ఆడ పిల్లల కోసం కూడా దాచిన రెండు లక్షల రూపాయలను కిషోర్‌కు ఇచ్చినట్లు తెలిపింది. కాబోయే భర్త తనకు పదోన్నతి లభిస్తే..తనకు తన పిల్లల జీవితం బాగుపడుతుందని పైసా పైసా కూడపెట్టిన డబ్బును కిషోర్‌కు ఇచ్చినట్లు తెలిపింది.
ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే.. పెళ్లి లేదు ఏమి లేదు అంటూ తప్పించుకుంటున్నాడని కనీసం తాను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వమని అడిగితే తాను ఎస్సైని అని దిక్కున్నచోట చెప్పుకో పో అంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. తాను మోసపోయానని తెలుసుకున్న నాగలక్ష్మీ… కృష్ణ జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందనలో పిర్యాదు చేసింది.
ఎస్పీ జాషువాను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. అంతేకాదు సహజీవనానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఇచ్చింది. ఎస్సై కిషోర్ తనను వివాహం చేసుకోవడంతో పాటు తన వద్ద తీసుకున్న నగదు ఇప్పించాలని ఎస్పీని నాగలక్ష్మీ వేడుకుంది. ఆమె ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ.., కేసు దర్యాప్తు నిమిత్తం దిశ స్టేషన్‌కు బదలాయిస్తూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Local News