జనసేన (Janasena) పదవ ఆవిర్భావ వేడుకలకు ముందు ఆ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీతో పాటు ఇతర పార్టీల వారు కూడా జనసేన గూటికి చేరుతున్నారు. ఇవాళ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్ తదితరులకు పార్టీలో చేరారు. వాళ్లందరికీ పవన్ కల్యాణ్ కండువా కప్పి.. సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019ల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీపై అసంతృప్తితో పార్టీని వీడి.. వైసీపీలో చేరారు. ఐతే వైసీపీలో కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు టీవీ రావు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని, ఇప్పుడామె హోమంత్రిగా ఉన్నారని టీవీ రావు అన్నారు. కానీ ఇప్పటికీ తన హామీని జగన్ నెరవేర్చుకోలేదని... కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
వైసీపీలో కేవలం కొందరికే పదవులను కట్టబెడుతున్నారని వైసీపీ హైకమాండ్‌పై మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టు కాకపోయినా.. కనీసం పార్టీ పదవి అయినా ఇవ్వాలని కోరినా... వైఎస్ జగన్ పట్టించుకోలేదని వాపోయారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు టీవీ రావు. అందుకే వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. ఇక జనసేనలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే... ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరిపోయారు.
కాగా, ఏపీలో జనసేన పార్టీ ఆవిర్బవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. మార్చి 14న... పదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న బందరులో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించి. ఆ వేదికగానే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పొత్తులపైనా పవన్ తేల్చేస్తారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janasena, Local News, Pawan kalyan, Vijayawada