అక్రమ మద్యం కేసు.. విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మీ రాజీనామా

Vijayawada News: నిన్న విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మికి చెందిన కారులో అక్రమ మద్యం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది.

news18-telugu
Updated: October 1, 2020, 11:30 AM IST
అక్రమ మద్యం కేసు.. విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మీ రాజీనామా
మద్యం దొరికిన దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మి కారు
  • Share this:
దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మి రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. ఆమెకు సంబంధించి వాహనంలో అక్రమ మద్యం రవాణా జరగడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వరలక్ష్మి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ దుర్గగుడి ఈవో, పాలకమండలి చైర్మన్‌తో పాటు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు పంపించారు. ఇదిలా ఉంటే నిన్న వరలక్ష్మికి చెందిన కారులో అక్రమ మద్యం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. తెలంగాణలోని మద్యం షాపుల్లో విక్రయించే మద్యం బ్రాండ్లు అందులో ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని పోలీసులు లెక్కించారు.

ఈ ఘటనకు సంబంధించి నాగ వరలక్ష్మి భర్త వరప్రసాద్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మికి చెందిన జగ్గయ్యపేటలోని నివాసంలో పోలీసులు ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి ఇంత భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని మద్యం దుకాణాల్లో సరుకుని కొన్న తర్వాత జాతీయ రహదారి మీద నుంచి కాకుండా ఇతర పల్లెటూర్లలో నుంచి ఏపీలోకి మద్యాన్ని తరలించినట్టు పోలీసులు గుర్తించారు. జగ్గయ్యపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏపీ 16 బీవీ 5577 నెంబరు గల కారులో భారీ ఎత్తున మద్యం ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ రైడ్ చేశారు. అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లో ఉన్న కారులో చెక్ చేయగా పెద్ద ఎత్తున మద్యం బయటపడింది.

ఏపీలో కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యాన్ని పరిమితం చేస్తామన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు భారీగా పెంచారు. లాక్ డౌన్ సమయంలో కేంద్రం నుంచి మద్యం షాపులు తెరవడానికి అనుమతి వచ్చిన తర్వాత ఏకంగా మద్యం ధరలు 50 శాతం పెరిగాయి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగింది. ఏపీ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో చాలా మంది అక్కడి నుంచి మద్యాన్ని అక్రమంగా తెస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ఏపీ ఎక్సైజ్ శాఖ తీవ్రంగా పనిచేస్తోంది.

సహజంగా ఏ ఆలయ పాలకమండలిలో అధికార పార్టీకి చెందిన నేతలే ఉంటారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు అనే బోర్డు ఉండడంతో ఆ కారును పోలీసులు ఆపి ఉండకపోవచ్చనే వాదన ఉంది. అధికార పార్టీకి చెందిన వాళ్లే కదా అనే అభిప్రాయంతో పోలీసులు లైట్ తీసుకుని ఉంటారనే వాదన ఉంది. అందువల్లే ఏకంగా రూ.40,000 విలువైన మద్యాన్ని ఏపీలోకి తీసుకురాగలిగారు. విజయవాడలో ఓ విందు కోసం ఇంత భారీగా మద్యాన్ని తెచ్చారని సమాచారం.పవిత్రమైన ఆలయానికి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో మద్యం పట్టుబడడం, అది కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తరలించినట్టు గుర్తించడంతో అటు ప్రభుత్వానికి కూడా ఇరకాటంగా మారింది. దీంతో ఆమె ముందుగా తన ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: October 1, 2020, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading