ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పదో తరగతి పరీక్షలు (AP SSC Results 2022) విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ విద్యార్థికి 11 మార్కులే రావడంతో పాస్ చేయించారంటూ తీవ్ర విమర్శలొచ్చాయి. పాలడుగు హేమంత్ అనే విద్యార్థికి మ్యాథ్స్ లో 17, సోషల్ స్టడీస్ లో 11 మార్కులే వచ్చాయి. అలాగే టోటల్ మార్క్ కూడా 170గా ఉన్నా పాస్ అయినట్లు ఫలితాల్లో ఉంది. సదరు విద్యార్థి మార్కుల లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరీ 11 మార్కులొస్తే పాస్ చేయడమేంటనే చర్చ కూడా జరిగింది. అధికారులు మరీ అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా అని చాలా మంది ప్రశ్నించారు.
తాజాగా దీనిపై విజయవాడ కలెక్టర్ ఢిల్లీరావు స్పందించారు. విద్యార్థిని పాస్ చేయడంలో తప్పేం లేదని ఆయన స్పష్టం చేశారు. సదరు విద్యార్థి ప్రత్యేక అవసరాలున్న కేటగిరీలోకి వస్తాడని.. అలాంటి వారికి 10 మార్కులు వచ్చినా పాస్ గా ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే అంశంపై సోషల్ మీడియాలో తప్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి వార్తలు నమ్మొద్దని ఢిల్లీరావు సూచించారు. దీనికి సంబంధించి గత ఏడాది ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని తెలిపారు.
ఇది చదవండి: మిషన్ 175.. పార్టీ నేతలకు జగన్ టార్గెట్.. వైసీపీ కొత్త వ్యూహం ఇదే..!
ఇదిలా ఈసారి టెన్త్ రిజల్ట్స్ లో 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. 6.22లక్షల మంది విద్యార్థులకు గానూ 4లక్షల మంది మాత్రమే పాసవడం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా టెన్త్ పాస్ పర్సంటేజ్ తగ్గిందని... దీనికి జగన్ సర్కార్ బాధ్యత వహించాలన్న డిమాండ్లు వినిపించాయి. గత ఐదేళ్లలో కంటే పాస్ పర్సెంటేజ్ భారీగా తగ్గడంపై ప్రభుత్వం విమర్శలపాలవుతోంది. ఈ వ్యవహారంలో ఇంగ్లీష్ మీడియం టాపిక్ కూడా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే టెన్త్ రిజల్ట్స్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పది పరీక్షా ఫలితాల విడుదల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది అన్నారు పవన్.. అందుకే 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి.. అలాగే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకీ ఫీజులు తీసుకోకూడదని కోరారు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరు. ధరలను అదుపులో ఉంచి ప్రజలను సంతోషపెట్టలేరు. ఇవన్నీ ప్రభుత్వానికి చేతకావడం లేదు.. కనీసం విద్యార్థులకైనా ఉపశమనం కలిగించాలని పవన్ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP ssc results