ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాప్ ను అందుబాటులోకి తీసకొచ్చింది. మహిళలకు వేధింపులు, ఇబ్బందులు, ఆపదలు ఎదురైతే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చాలు నిముషాల్లో పోలీసులు అక్కడికి వచ్చి వారిని రక్షిస్తారు. యాప్ పై అవగాహన కల్పించేందుకు ఇప్పటివరకు కేవలం మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించారు. కానీ రాష్ట్రంలో మొదటిసారి దిశ యాప్ ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు. ఫిర్యాదు చేసిన ఎనిమిది నిముషాల్లోనే స్పాట్ కు చేరుకొని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లాకు చెందిన షేక్ హిరుతున్నీసాకు 2018లో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ తో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నకానులకలు భారీగానే ఇచ్చారు. ఐతే కొన్నాళ్లకే భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈలోగా బాధితురాలికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో వారు వీరంకిలాకులో కాపురంపెట్టారు.
అక్కడ కూడా అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక పమిడిముక్కల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. ఐతే కేసులో రాజీ కుదరడంతో నాలుగు నెలల నుంచి పోరంకిలోని బాలాజీ నగర్లో నివాసముంటున్నారు. పోలీసులు హెచ్చరించినా, పెద్దలు నచ్చజెప్పినా అత్తింటివారిలో మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్నహీరుతిన్నాసాపై భర్త దాడి చేశాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. అక్కడితో ఆగకుండా ఆమెను చంపేస్తానని బెదరించాడు. అదే సమయంలో బాధితురాలు తన మొబైల్ లో ఉన్న దిశ యాప్ ద్వారా మధ్యాహ్నం 3.10గంటలకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన సీఐ సత్యనారాణయ సిబ్బందిని ఘటనాస్థలికి పంపారు. కేవలం 8 నిముషాల్లోనే ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు రాకను పసిగట్టిన భర్త ఇస్మాయిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో తన ప్రాణాలు నిలిచాయని బాధితురాలి తెలిపింది. మరోవైపు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అపదలో ఉన్నవారు దిశయాప్ ను ఆశ్రయిస్తే నిముషాల వ్యవధిలోనే సాయం అందుతుందని పోలీసులు చెబుతున్నారు. కావున మహిళలంతా దిశ యాప్ ను తమ మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న కొన్ని ఘటనల కారణంగా దిశ యాప్ వినియోగంపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ల సాయంతో ప్రతి ఒక్కరు దిశ యాప్ ఇన్ స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP disha act