VIJAYAWADA DAUGHTER STAGE PROTEST AGAINST FATHER FOR CHEATING HER HUSBAND IN NTR VIJAYAWADA DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Daughter Protest: తండ్రి అంతపని చేస్తాడనుకోలేదు.. పుట్టింటిపై కూతురి పోరాటం.. అసలు స్టోరీ ఇదే..!
ధర్నా చేస్తున్న నాగశేషు
Vijayawada Woman: అదనపు కట్నం లేదా అనుమానించడం, ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేస్తే అత్తింటి ముంటు ధర్నా చేస్తారు. కానీ ఓ వివాహిత మాత్రం మెట్టినింటి కోసం పుట్టింటిపై పోరాటానికి దిగింది. అది కూడా తండ్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది.
సాధారణంగా పెళ్లైన మహిళలు భర్త వేధిస్తున్నాడనో.. సరిగా చూసుకోవడం లేదనో.. అత్తమామలు హింసిస్తున్నారనో.. లేక ఆడపడుచు సాధిస్తుందనో మెట్టినింటి ముందు ఆందోళనకు దిగుతుంటారు. అదనపు కట్నం లేదా అనుమానించడం, ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేస్తే అత్తింటి ముంటు ధర్నా చేస్తారు. కానీ ఓ వివాహిత మాత్రం మెట్టినింటి కోసం పుట్టింటిపై పోరాటానికి దిగింది. అది కూడా తండ్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. వినడానికి, చూడ్డానికి కాస్త వింతగానే అనిపించినా ఇది నిజం. తన తండ్రి తనను తన భర్తను మోసం చేశాడని న్యాయం చేయాలంటూ మౌనపోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా (NTR District) కంచికచర్లకు చెందిన సూరిశెట్టి సీతారామయ్య కొన్నేళ్ల క్రితం తన కుమార్తె నాగశేషుకు వివాహం చేశాడు.
కూతుర్ని, అల్లుడ్ని సీతారమయ్య తన దగ్గరికే తెచ్చుకున్నాడు. ఐతే పెళ్లి సమయంలో కూతురికి ఇస్తానన్న పొలం ఇవ్వకపోగా, అల్లుడి దగ్గరే భారీగా డబ్బులు తీసుకున్నాడు. విడతలవారీగా నాలుగున్నర లక్షలు తీసుకున్నాడు. కట్నంగా ఇస్తానన్న పొలం సంగతి పక్కనబెట్టి కనీసం తీసుకున్న డబ్బు అయినా ఇవ్వాలని కోరితే అల్లుడ్ని, కూతుర్ని ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అత్తింట్లో నా పరువు పోతుంది నాన్న డబ్బులు తిరిగిచ్చేయ్ అని కూతురు వేడుకున్నా సీతారామయ్య మాత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. అంతేకాదు మాట దాటవేస్తూ తన భర్తను అవమానిస్తున్నట్లు నాగశేషు ఆరోపిస్తోంది. తండ్రితో పాటు తన సోదరులు కూడా డబ్బులివ్వకుండా వేధిస్తున్నట్లు పేర్కొంది. తండ్రి తమ డబ్బులివ్వకపోవడంతో అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నాగశేషు చెప్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కంచకచర్ల నెహ్రూ సెంటర్లోని నెహ్రూ విగ్రహం వద్ద మౌనదీక్ష చేస్తోంది.
సాధారణంగా ఆస్తిలో వాటాల కోసం కట్నం డబ్బుల కోసం కూతుళ్లు తల్లిదండ్రులతో పోట్లాడటం వంటివి చూస్తుంటాం. కానీ అల్లుడి దగ్గరే డబ్బులు తీసుకొని కూతుర్ని ఇబ్బంది పెట్టడం మాత్రం తొలిసారి చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయిని ఇచ్చిన చోట అదనంగా ఇవ్వకపోయినా ఫర్వాలేదుగానీ.. ఎదురు డబ్బులు తీసుకొని మోసం చేయడం భావ్యం కాదంటున్నారు. మరి తండ్రిపై పోరాడుతున్న నాగశేషుకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఇక ఇదే జిల్లాలోని నందిగామలో ఓ వివాహిత భర్త, అత్తమామలు, ఆడపడుతు వేధిస్తున్నారంటూ ఏకంగా కృష్ణానదిలోనే ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం పెళ్లైన తనను భర్త దూరం పెడుతున్నాడని.. అతడు సంసారానికి పనికిరాకపోయినా మోసం చేసి పెళ్లి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.