K Pawan Kumar, News18, Vijayawada
ప్రతి ఒక్కరికీ తమ ఇంటి మీద హక్కు ఉంటుంది. ఇంటి ముందున్నది రోడ్డయినా సరే.. న్యూసెన్స్ జరుగుతుంటే తప్పని వారిస్తారు. అలా తన ఇంటి ఎదుట బహిరంగంగా మద్యం తాగుతున్నవారిని వెళ్లిపొన్నాడో వ్యక్తి. ఇంకేముంది తాగుబోతులిద్దరూ పగబట్టారు. అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. కానీ చట్టం ఊరుకోదుగా ఇద్దరినీ కటకటకాల్లోకి నెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. 2013 మే 13న విజయవాడ సింగ్ నగర్లోని లూనా సెంటర్ కు చెందిన జాన్ ఇంటి ఎదుట రాత్రి సమయంలో అదే ప్రాంతానికి చెందిన నేలటూరి రవి, మట్టపర్తి దుర్గాప్రసాద్, చీపురుపల్లి ప్రసాద్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. తమ ఇంటి ఎదుట మద్యం తాగుతున్నవారిని జాన్ వారించాడు.
దీంతో అతడిని చంపేస్తామని ముగ్గురూ బెదిరించారు. తర్వాతి రోజు జాన్.. కండ్రిక కాలనీ వద్ద ఉండగా.. నిందితులు అతడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. జాన్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. దాదాపు పదేళ్లపాటు విచారణ జరపగా.. నేరం రుజువుకావడంతో 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.500 జరిమానా విధించింది.
కేసులో మరో ముగ్గురు నిందితులుండగా.. వారిలో ఒకరు చనిపోగా.. మిగిలిన ఇద్దరిపై కేసు కొట్టేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డా. జి కళ్యాణి , సి.యమ్.ఎస్. ఇన్స్పెక్టర్ , శ్రీ కె.నాగేశ్వర రావు, ఇన్స్పెక్టర్ వై.సత్య కిషోర్ మరియు సి.యమ్.ఎస్. సిబ్బంది పర్యవేక్షణలో 16 మంది సాక్షులను విచారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada