వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి. సీఎం హోదాలో ఆయన వివిధ పర్యటనలకు వెళ్తుంటారు. పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతారు. ఈ క్రమంలో తాడేపల్లికి, గన్నవరం చాలా సార్లు ప్రయాణించారు. ఐతే ఇటీవల తిరుపతి (Tirupathi) పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల వద్దకు రాగానే తీవ్ర దుర్గంధం వచ్చింది. వెంటనే సమస్యపై సీఎంఓ అధికారులను ప్రశ్నించారు. అక్కడ సమస్యేంటో కనుక్కోవాలని ఆదేశించారు.
సీఎం ఆదేశించడంతో ఒక్కసారిగా అధికారులు పరులుగు పెట్టారు. ఆ సమాచారం సీఎంఓ నుంచి సచివాలయానికి అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ కు అక్కడి నుంచి సంబంధిత శాఖలకు చేరింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, కృష్ణాజిల్లా కలెక్టర్ జే నివాస్, ఏఎంఆర్డీ కమిషనర్ విజయ్ కృష్ణన్, స్వచ్ఛ భారత్ ఎండీ సంపత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు, బల్లెవారి వీధి, ఆటోనగర్, కనకదుర్గ కాలనీ ప్రాంతాలను పరిశీలించారు.
స్థానికంగా ఉన్న డ్రెయినేజీ సమస్య, ఇతర అంశాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. చాన్నాళ్లుగా డ్రెయినేజీ సమస్య వేధిస్తోందని పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులకు చెప్పారు. ఏకంగా ముఖ్యమంత్రే సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలమీద అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చాన్నాళ్లుగా ఉన్న సమస్య సీఎం చొరవతో అయినా పరిష్కారమవుతుందో లేదో వేచి చూడాలి.
తిరుపతిలో మహిళ సమస్యపై...
ఇక ఆదివారం తిరుపతి వెళ్లిన సీఎం జగన్ కు ఎయిర్ పోర్టు వద్ద ఓ మహిళ వినతి పత్రం అందించేందుకు యత్నించింది. సీఎం కాన్వాయ్ వెళ్తుండగా తన సమస్యను చెప్పుకునేందుకు పరుగులు పెట్టింది. మహిళను చూసిన సీఎం తన వాహనాన్ని ఆపి తన ఓఎస్డీ ధనుంజయ రెడ్డిని పంపి సమస్యను తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో కారు దిగిన ఆయన పరుగులు పెట్టుకుంటూ వచ్చి మహిళ వద్ద వినతిపత్రం తీసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రజాసమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Vijayawada