Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
డబ్బులంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి.? ముఖ్యంగా మధ్య తరగతి వారు తమ డబ్బులు రెట్టింపవ్వాలని కోరుకుంటారు. అలాంటి బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు ఆకర్షణీయమైన స్కీమ్ లతో జనం నెత్తిన టోపీపెడుతున్నారు. విజయవాడ (Vijayawada) కేంద్రంగా జనానికి కోట్లలో కుచ్చుటోపి పెట్టిన "సంకల్పసిద్ది" స్కామ్ (Sankalp Sidhi Scam) తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.ప్రజలకు అత్యాశ కల్పించి వారి నుండి వేలకోట్ల రూపాయలు దండుకుని చివరికి బోర్డు తిప్పేసే దాకా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. నిందితుడు గతంలో కూడా చైన్ మార్కెటింగ్ పేరుతో పలువురిని మోసం చేసినట్లు అతని పై కేసులు కూడా ఉన్నాయని సమాచారం.
గొలుసు కట్టు వ్యాపారం పేరుతో గతంలో ఎన్నో మోసాలు చోటుచేసుకున్నా ఏ దశలోనూ ప్రజలను అప్పమత్తం చేయడంలో గాని, నిందితులు మోసపూరితంగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేడాన్ని నివారించడంలో గాని పోలీసుల నిఘావైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. సంకల్పసిద్ధి స్కీమ్ లో ప్రధాన నిందితుడు, గన్నవరం ప్రాంతానికి చెందిన వేణుగోపాల కృష్ణ అనే వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐతే ఇంత పెద్ద స్కీమ్ వెనుక అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రముఖుల పాత్ర ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.చిన్నచిన్న మోసాలు జరిగితేనే తీవ్రంగా చర్యలు తీసుకునే పోలీసులు రకరకాల స్కీముల పేరుతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ వసూళ్ళకు పాల్పడినా ఆ వైపు కూడా తొంగిచూడలేదంటే నమ్మశక్యంగా లేదంటున్నాయి ప్రతిపక్షాలు.
స్కీమ్ నిర్వాహకుల నుండి రాజకీయ నాయకులు పోలీసు అధికారులు భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా సంకల్పసిద్ధి స్కామ్ పై గన్నవరానికి చెందిన మాజీ సైనికోద్యోగి యం.రవికుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అందుకే ఈ విషయం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసులు నిందితుడిని హడావిడిగా అరెస్ట్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపణ. పాత్రదారి సంగతి సరే ఇంత పెద్ద మోసం వెనుక ఉన్న సూత్రదారులను కూడా బయటికి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు, బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime, Vijayawada