K Pawan Kumar, News18, Vijayawada
కృష్ణా జిల్లా (Krishna District) లో ఫోర్జరీ సంతకాలు కలకలం సృష్టించాయి. ఇందులోఇద్దరు విలేకర్ల పాత్ర ఉండటంతో పోలీసులు ఖంగుతున్నారు. ఆ వివరాలు చూస్తే ఆశ్చర్యపోకమానరు. అవినీతిని తమ కలంతో అంతమెుందించాల్సింది పోయి పాత్రికేయులే ఇలాంటి ఫోర్జరీలకు పాల్పడటం సిగ్గుచేటు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన వినోద్ రెడ్డికి సర్వే నంబర్ 64-3లో 25 సెంట్ల స్థలం ఉంది. ఇది వినోద్ రెడ్డికి తన తల్లికి వీలునామా ద్వారా వచ్చింది. ఈ స్థలాన్ని వినోద్ రెడ్డి విక్రయించాలని నిశ్చయించుకున్నాడు. దీంతో మచిలీపట్నానికి చెందిన ల్యాడ్ బ్రోకర్ అలీని సంప్రదించాడు. తన విలువైన స్థలాన్ని అమ్మాలని బేరం కుదుర్చుకున్నాడు. అయితే అలీకి వినోద్ కు భూమి ధర విషయంలో బేరం కుదరలేదు.
అయితే ఆ స్థలం బాగా విలువచేసేది కావటంతో బ్రోకర్ అలీ దానిపై కన్నేశాడు. ఎలాగైనా దానిని దక్కిచుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంతే అనుకున్నది వెంటేనే అమలుపరిచాడు. దీనికి పామర్రు,గుడివాడలోని ఇద్దరు విలేకర్ల సాయం తీసుకుని వారికి ముడుపులు చెల్లించాడు.
దీంతో ఆ ఇద్దరు జర్నలిస్టులు సదరు స్థలానికి సంబంధించి దొంగ పత్రాలు సృష్టించారు. పైగా వీఆర్వో, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి ఆ స్థలం అలీ అనే వ్యక్తి దే అని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. అయితే ఎవరికి అనుమానం రాకూడదని పిత్రార్జితం ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ పనులు సులభతరం అవ్వడం కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచాలు చెల్లించుకున్నాడు. పామర్రులోని స్థలాన్ని తెలివిగా గుడివాడలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
ఇక్కడ ఆసక్తికర పాయింట్ ఏమిటంటే...పామర్రు రిజిస్ట్రేషన్ గుడివాడలో చేయడానికి పామర్రుకు చెందిన రిజిస్ట్రార్ కూడా ఓకే చెప్పడంతో గుడివాడలో రిజిస్ట్రేషన్ చాలా సులభంగా ముగిసింది. అంతేకాకుండా ఈ స్థలాన్ని అలీ పామర్రుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విక్రయ రిజిస్ట్రేషన్ చేశాడు. సదరు స్థలం కొనుగోలు చేసిన వారు అక్కడ నిర్మాణం కోసం భూమి పూజ చేస్తండటంతో వేరే వ్యక్తుల ద్వారా నిజం తెలుసుకున్న అసలు ఓనర్ వినోద్ రెడ్డి ప్రశ్నించాడు. దీంతో రెండ నెలల క్రితమే తాము స్థలం కొనుగోలు చేశామంటూ డాక్యుమెంట్లు చూపించారు. దీంతో వినోద్ రెడ్డి పామర్రు పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసిన గుడివాడ డిఎస్పీ సత్యానందం దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సంతకాన్ని ఫోర్జరి చేసారని నిర్దారించి పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు పామర్రు తహసీల్దార్ భరత్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Local News, Vijayawada