ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలనుందా..? ఇప్పటికే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం 23 సీట్లకే పరిమితమైంది. వారిలో ఇప్పటికే నలుగు టీడీపీని కాదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడనున్నట్లు సమాచారం, పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి దక్కకపోవడమే ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఐదేళ్లు పదవి కోసం ఎదురుచూసినా అమాత్యయోగం కలగలేదు.
ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐతే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఆయన ఏ పార్టీలో చేరుతారు..? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదానిపై స్పష్టత లేదు. వేరే పార్టీలో చేరుతారా..? లేక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP