ఏపీలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు నిత్యం వేలాది మంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. కొందరు ఒకే దేవాలయానికి వెళ్లకుండా.. ఆ చుట్టు పక్కల ఉండే.. క్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి.. అక్కడి నుంచి మరోచోటికి వెళ్లాలంటే... ఖర్చు ఎక్కువగా అవుతుంది. అలా వేర్వేరు ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లే వారికి..ఏపీ పర్యాటకశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో పుణ్యక్షేత్రాలను ఆరు సర్క్యూట్స్‌గా విభజించి.. తక్కువ ధరకే ప్యాకేజీలను తీసుకురానున్నట్లు వెల్లడించింది.
తొలి దశ కింద విజయవాడ కేంద్రంగా మూడు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్లను రూపొందించిట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. రెండో దశలో విశాఖ నుంచి మరో మూడు సర్క్యూట్లను తీసుకొస్తామని వెల్లడించారు. ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. తక్కువ ధరకే.. ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఒక్కో సర్క్యూట్‌లో 7 నుంచి 10 దేవాలయాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గైడ్‌తో పాటు ఆలయ దర్శనం, రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Srisailam: శివరాత్రి బ్రహోత్సవాలకు శ్రీశైలం వెళ్లే శివభక్తులకు శుభవార్త
విజయవాడ–తిరుపతి సర్క్యూట్ కింద.. విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి, తిరుచానూరు, కాణిపాకం ఆలయాలు వస్తాయి. విజయవాడ–సింహాచలం సర్క్యూట్ కింద.. ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అన్నవరం, లోవ తలుపులమ్మ, పిఠాపురం, దత్తాత్రేయపీఠం, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ర్యాలి లక్ష్మీజగన్మోహినీ కేశవస్వామి, సింహాచలం ఆలయాలకు ప్యాకేజీని తీసుకొస్తారు. ఇక విజయవాడ–శ్రీశైలం సర్క్యూట్ కింద.. ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
విశాఖ–తిరుపతి సర్క్యూట్ కింద.. సింహాచలం, విశాఖ కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నెల్లూరు రంగనాథస్వామి, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, కాణిపాకం ఆలయాలు వస్తాయి. విశాఖ–శ్రీశైలం సర్క్యూట్ కింద.. సింహాచలం, విశాఖ కనకమహాలక్ష్మి దేవాలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, పెదకాకాని మల్లేశ్వరస్వామి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి ప్యాకేజీని తీసుకొస్తారు. విశాఖ–శ్రీకాకుళం సర్క్యూట్ కింద.. సింహాచలం, విశాఖ కనకమహాలక్ష్మి దేవాలయం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామతీర్థం ఆలయాలను దర్శించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada