Andhra Pradesh: 5 నుంచి ఇంటర్ పరీక్షలు. ప్రతి సెంటర్ లో కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ నియామకం

మే 5 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు

ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్టే పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ప్రత్యేక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఐసోలేషన్ వార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • Share this:
    ఏపీలో ఓ వైపు కరోనా వేగంగా దూసుకుస్తోంది. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాలను కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించారు అధికారులు. చాలా జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ష్యూ కొనసాగుతోంది. ఇలా ఓ వైపు ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియెట్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంపై ప్రభుత్వ అధికారులు ఫోకస్ చేశారు.

    కృష్ణా జిల్లాలో పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ ఏఎండీ  ఇంతియాజ్ సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ మే 2021 నిర్వహణపై కలెక్టర్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఇంతియాజ్‌.. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జిల్లాలో మొత్తం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

    జిల్లాలో 1 లక్షా 12 వేల 154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాయనున్నారని, వారిలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 54 వేల 171 మందికాగా రెండవ సంవత్సరం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 57 వేల 983 మంది ఉన్నారని కలెక్టరు చెప్పారు. పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని, అలాగే అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర 104 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 4 ఫయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామన్నారు. అలాగే 8 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

    ఇదీ చదవండి: విద్యార్థులకు నష్టం కలిగించలేం. పది, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ క్లారిటీ

    ముఖ్యంగా కోవిడ్‌ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ను నియమించామని, ఐసోలేషన్‌ గదిని కూడా ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. పరీక్షా కేంద్రాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రూట్‌ వివరాలను ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే అందించామన్నారు. పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టరు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల దగ్గర అవసరమైన పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేయాలన్నారు.

    ఇదీ చదవండి: కరోనా కష్టకాలంలో విద్యార్థులు హ్యాపీ? జగనన్న వసతి దీవెన నగదు జమ చేసిన సీఎం జగన్‌

    అలాగే కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కేబీ చంద్రశేఖర్‌ ఆమోదంతో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ డి.రామశేఖరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు, పరీక్షల టైంటేబుల్‌ను వర్సిటీ వెబ్‌సైట్‌ లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించామన్నారు.
    Published by:Nagesh Paina
    First published: