ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణాజిల్లా (Krishna District) కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై (Kondapally Municipal Chairman Election) వివాదానికి తెరపడింది. రెండు రోజులుగా వాయిదా పడుతున్న ఛైర్మన్ ఎన్నికలో హైకోర్టు జోక్యం చేసుకుంది. బుధవారం పోలీస్ భద్రత నడుమ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఛైర్మన్ ఎన్నికపై తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు .. ఎన్నిక జరిపేలా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించాలని ఎస్ఈసీకి సూచించింది. ఎన్నిక సజావుగా జరిగేలా భద్రత కల్పించాలని విజయవాడ ఇన్ ఛార్జ్ సీపీని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించిన తర్వాత ఫలితం ప్రకటించకుండా సంబంధిత వివరాలను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ స్పందించారు. కోర్టు ఆదేశాల మేరకు ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగేలా పోలీసులు సహకరించాలని ఆయన కోరారు. నిన్నటి మాదిరిగానే కొండపల్లి మున్సిపల్ ఆఫీసులో వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న ప్రక్రియన్న సంగతి మరిచిపోయి అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సోమవారం ఎన్నికను వాయిదా వేయడమే తప్పని ఆయన విమర్శించారు. ఎన్నిక వాయిదాపై టీడీపీకి సమాచారం ఇవ్వలేదన్నారు. ఛైర్మన్ ఎన్నిక జరిగేవరకు, ఆ తర్వాత కూడా టీడీపీ కౌన్సిలర్లకు పోలీసులు రక్షణ కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
కొండపల్లిలో 29 వార్డులుండగా 14 వైసీపీ, 14 టీడీపీ గెలిచాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఐతే వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో ఆ పార్టీ బలం కూడా15కు చేరింది. ఇక్కడే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మంత్రాంగం నడిపారు. కొండపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు కోసం హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకన్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది.
ఐతే దీనినే వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారని.. అక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తికి కొండపల్లిలో ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. విజయవాడలో ఓటు హక్కున్న విషయాన్ని కోర్టులో దాటిపెట్టి కొండపల్లిలో ఓటు హక్కు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆరోపిస్తున్నారు. అప్రజాస్వామికంగా ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.