ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఆలోచించిన ప్రభుత్వం.. ఉద్యోగుల కోసం లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ను కొనుగోలు చేయనుంది. బ్యాంక్ లింకేజ్ తో టూ వీలర్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఈ మేరకు త్వరలోనే బిడ్లను ఆహ్వానించబోతోంది. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేయనుంది. దీంతో ఆయా సంస్థలకు రూ.500 నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఆర్డర్లు వెళ్లే అవకాశముంది. ఇంత భారీ స్థాయిలో ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కానుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు, సాధారణ ఉద్యోగులతో కలిపి దాదాపు 6లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో ఆసక్తిగలవారికి తక్కువ వడ్డీతో రుణసదుపాయం కల్పిస్తూ వాహనాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషయన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం జతకట్టింది. ఎలక్ట్రిక్ బైకులను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు అటోమొబైల్ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద బైకులు కొనుగోలు చేసిన వారికి తక్కువ వడ్డీ రేటు, భారం లేని ఈఎంఆ సౌకర్యంతో రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చిస్తోంది. కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినట్లు రాష్ట్ర నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ తెలిపింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలైన ఒకినావా, అంపేర్ సంస్థలు బైకులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో బిడ్లు దాఖలవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది లోపు ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులందరికీ లక్ష ఎలక్ట్రిక్ బైకులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పథకం ప్రారంభించిన తర్వాత డిమాండును బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఈ పథకానికి ఈఈఎస్ఎల్ తో పాటు ఎన్టీపీసీ ఆర్ధిక సాయమందించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం అమలుచేయబోయే ఈ పథకం రాష్ట్రంలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రానిక్ టూవిలర్ల వాడకం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పథకం ప్రారంభించిన తర్వాత వాటి సర్వీసింగ్ పైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650 మండల కేంద్రాలు 100 మున్సిపీలిటీల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు కూడా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇలా భారీగా వాహనాలు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అంబులెన్సులు, రేషన్ డోర్ డెలివరీ వాహనాలు, చెత్త తరలించే వాహనాలను వేలసంఖ్యలో కొనుగోలు చేసింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.