ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రూ.41వేల కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని బుగ్గన అన్నారు. పయ్యావుల చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ఆయన.. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్ధిక పరిస్థితిపై పీఏసీ ఛైర్మన్ కు ఏమైనా అనుమానాలుంటే ప్రభుత్వాన్ని వివరణ అడగవచ్చన్నారు. అలాగే ఏమైనా సందేహాలుంటే సమావేశం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని.. లేఖలు రాయడం వల్ల ప్రయోజనలేంటో అర్ధం కావడం లేదన్నారు.
పయ్యావుల ఆరోపించినట్లు రూ.41వేల కోట్ల మేర అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోవా..? అని ప్రశ్నించారు. ఆర్ధిక అంశాలపై ఎప్పుడూ యనమల మాట్లాడతారని ఇప్పుడు పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారన్నారు. గవర్నర్ కు లేఖ రాయడం, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయాల్సిన అవసరమేంటో అర్ధం కావడం లేదని బుగ్గన అన్నారు. రూ.41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆడిట్ సంస్థ వివరణ కోరిందని.. ఏజీ కార్యాలయానికి అన్ని వివరాలు పంపిస్తామన్నారు. అసలు ఇలా జరగడానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే ప్రధాన కారణమని బుగ్గన ఆరోపించారు. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడం వల్లేన్నారు. టీడీపీ ప్రభుత్వమే 2018లో ఈ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొచ్చి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఈనెల 8న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు. రూ.41వేల కోట్లకు సంబంధించిన చెల్లింపులకు సరైన లెక్కలు లేవన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమదగ్గరున్నాయని.. వాటిని గవర్నర్ కు సమర్పించిన ఆయన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీ రుణపరిమితిని తగ్గించిందన్న వార్తలు ఓ వైపు.. వేల కోట్ల బిల్లులకు లెక్కలు లేవని ప్రతిపక్షాల ఆరోపణలు మరోవైపు వెరసి ఏపీ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విమర్శలకు ఎలా చెక్ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Buggana Rajendranath reddy, TDP, Ysrcp