CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇవాళ విజయవాడ (Vijayawada), నెల్లూరు (Nellore) లో పర్యటించనున్నారు. ముందుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ (Jai Ho BC) మహాసభకు సీఎం జగన్ హాజరవుతారు. ఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ జయహో బీసీ మహాసభ జరగనుంది. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, జనాలు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు చేశారు. జయహో బీసీ మహాసభ ఉండడంతో బుధవారం విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
బెంజిసర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
జయహో మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ.. వారికి పేరుపేరునా ఆహ్వానపత్రికలను పంపారు. వెనుకబడిన వర్గాలే వెన్నెముక నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతోపాటు విజయవాడ నగరాన్ని వైఎస్సార్సీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతానంటూ 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్లుగా చిత్తశుద్ధితో అమలుచేస్తున్నామని.. ఏం చేశామన్నది ఈ సమావేశం చెబుతామంటున్నారు బీసీ మంత్రులు.
ఇదీ చదవండి : శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి.. చెలరేగిన మంటలు.. 8మందికి గాయాలు
ఇదే అంశాన్ని వివరించి.. రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీసీలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ‘జయహో బీసీ’ మహాసభను వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్నామంటున్నారు మంత్రులు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అందులో ఇప్పటి వరకు ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాల ప్రజలకు మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అధిక ప్రయోజనాలు చేకూర్చారు అనే విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేదరికం నుంచి గట్టెక్కించడం, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం, పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజానికి వెన్నెముకలా బీసీలను తీర్చిదిద్దుతున్నారు.
ఇదీ చదవండి : నేడు.. రేపు ప్రత్యేక పూజలు.. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..
ఈ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు నెల్లూరు చేరుకోనున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3:55 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayawada