(Anna Raghu,Sr.Correspondent,Amaravathi,News18)
అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు అరుదైన ప్రసాదం సమర్పించడానికి ఎన్ఆర్ఐ భక్తులు ముందుకు వచ్చారు. సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన 365 రకాల బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్(Hyderabad)కు చెందిన K.మౌనిక రెడ్డి(MounikaReddy),శిరీషరెడ్డి(Sirisha Reddy)అమ్మవారికి 365 రకాల సేంద్రియ బియ్యం(Organic rice)అందించేందుకు ముందుకు వచ్చారు.
భక్తి శ్రద్దలతో ..
గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన రైతు బాపారావు, పాలేకర్ విధానంలో వరిసాగు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శిరీష రెడ్డి సేంద్రియ బియ్యం అమ్మవారికి సమర్పించుకునేందుకు ముందుకు వచ్చారు. రోజుకు 50 కిలోల చొప్పున సంవత్సరంపాటు వారు సేంద్రీయ బియ్యం అందించనున్నారు. ఆ బియ్యంతో అమ్మవారికి నైవేద్యంతోపాటు, ప్రసాదాలు తయారు చేసి భక్తులకు పంచనున్నారు.
ముందుగా 21 రకాల సేంద్రీయ బియ్యాన్ని శిరీషారెడ్డి ఆలయ ఈవో భ్రమరాంబకు అందించారు. బలరాం సాల్, హవలిగట్టి, కళావతి బ్లాక్ రైస్, జలక, ఉజల మణిపాల్, నవారా, రూబా ఫుల్, సుడిదాన్యం, బైరలోడు, సురమటియ, దేవరాణి, బారాగలి, బడావోష్, ఘని, కామిని భోగ్, సికి బాలి, రమ్య గలి, అలసకీబా, కంద సాగర్, లెండముగియ, దాసరబలి, కుసుమ, ఇంద్రాణి లాంటి ఎంతో అరుదైన, విలువైన బియ్యాన్ని, ఒక్కో రకం 8కేజీల వంతున అమ్మవారికి అందజేశారు. వీటిని అమ్మవారి మహా నివేదన కొరకు, భక్తులకు ప్రసాదముగా అందజేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి భ్రమరాంబ తెలిపారు.
అరుదైన 365రకాల బియ్యం..
అంతరించి పోతున్న అరుదైన ధాన్యం రకాలను కాపాడటంతోపాటు, సేంద్రీయ పద్దతిలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించే పంటలను ప్రోత్సహించేందుకు శిరీషారెడ్డి ఈ మార్గం ఎంచుకున్నారు. పాలేకర్ విధానంలో వ్యవసాయం చేసే రైతులకు అండగా నిలవడంతోపాటు, వేలాది మంది అమ్మవారి భక్తులకు రసాయనాలు లేని ప్రసాదాలు అందించడం వీరి ప్రధాన ఉద్దేశం. ఎంతో విలువైన ధాన్యం రకాలకు గుర్తింపు తీసుకు వచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శిరీషా రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ అమ్మవారికి సేంద్రీయ బియ్యం అందించేందుకు వారు ముందుకు వచ్చారు. సంవత్సరం పాటు ముందుగా రోజుకు 50 కిలోల సేంద్రీయ బియ్యం అందించనున్నారు. ఏడాది తరవాత బియ్యం అందుబాటును బట్టి, భక్తుల అభిప్రాయాలను తీసుకుని మరిన్ని సేంద్రీయ ఉత్పత్తులను అమ్మవారికి అందించేందుకు శిరీషారెడ్డి ఆసక్తి చూపుతున్నారు. శిరీషా రెడ్డి నిర్ణయాన్ని పలువురు భక్తులు కొనియాడుతున్నారు.
సేంద్రియ ధాన్యాలతోనే నైవేద్యం..
అందుబాటులో లేకుండా పోయిన అరుదైన ధాన్యం రకాలను కూడా తమకు అందిస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వారిని దుర్గమ్మ దేవాలయ అధికారులు కూడా ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. దేవాలయాల్లో నైవేద్యాలకు, ప్రసాదాలకు కేవలం సేంద్రియ పద్దతిలో పండించిన పంటలను మాత్రమే వాడాలనే నిబంధన అమల్లోకి తీసుకురావాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. ఇలా చేస్తే సేంద్రియ విధానంలో పండించిన రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.