విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడి కేసులో పోలీసులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడును(Nara Chandrababu Naidu) నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరును ఏ-1గా నమోదు చేశారు. అలాగే ఏ-2గా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఏ-3గా టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావులతో పాటుగా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన చంద్రబాబు నాయుడు రామతీర్థంకు వచ్చారు. అయితే అంతకంటే ముందుగానే అక్కడికి చేరుకున్న విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లి రాముని విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డిని అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు విజయసాయిరెడ్డి కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. గురువారం వారిని విజయనగరంలో కోర్టులో హాజరుపరిచారు. అక్కడ వీరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో సువ్వాడ రవిశేఖర్, మహంతి శ్రీహరి, పాపునాయుడు, జగన్నాథం, పైడిరాజు, శీర రామకృష్ణ, సుంకర నాగరాజులు ఉన్నారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కళా వెంకట్రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని దేవాలయాలపై, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేదన్నారు. కానీ ప్రశ్నించిన వారిని మాత్రం అరెస్ట్ చేస్తుందని విమర్శించారు. ఇక, కళా వెంకట్రావును బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసలు.. అదే రోజు రాత్రి 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kinjarapu Atchannaidu, Vijayasai reddy