‘అమ్మా మాకు ఆకలేస్తుంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు.’ అంటూ అర్ధరాత్రి ఓ మహిళ ఫోన్ చేయడంతో కదిలిపోయారు. అప్పటికప్పుడు వంట చేసి తీసుకుని వెళ్లి బాధితులకు అందజేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చూపిన మానవత్వం తెలిసిన వారిని కంటతడిపెట్టించింది. ఆమెను అభినందించకుండా ఉండలేకపోయేలా చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన 11 మంది వలస కూలీలు నెల్లూరు జిల్లాలో పనుల కోసం వెళ్లారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. తమ వద్ద ఉన్న అరకొర డబ్బులతో వారు కాలం గడిపారు. అయితే, చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో ఇక దిక్కుతోచని స్థితిలో కాలినడకన సొంతూళ్లకు బయలుదేరారు. కడుపు కాలుతున్నా.. ఎండ మాడుతున్నా... లెక్కచేయకుండా నడిచారు. తమ జిల్లాకు చేరుకుంటే అదే పదివేలు అనుకున్నారు. అయితే, వారు విజయనగరం జిల్లా చెక్ పోస్టు వద్ద ఆహారం ఉంటుందనుకున్న వారి ఆశ నిరాశే అయింది.
క్వారంటైన్ కేంద్రంలో వలస కూలీలతో మాట్లాడుతున్న ఎస్పీ రాజకుమారి
చెక్ పోస్టు వద్ద 11 మందిని చూసిన పోలీసులు వారిని తీసుకుని వెళ్లి క్వారంటైన్ కేంద్రంలో పెట్టారు. ఓ వైపు ఆకలి, మరో వైపు క్వారంటైన్ కేంద్రంలో ఏం చేయాలో పాలుపోక ఓ మహిళ తనకు తెలిసిన ఓ విలేకరికి ఫోన్ చేసింది. అతడు ఎస్పీ బి.రాజకుమారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. పొద్దున్నే లేచి ఆఫీసుకు వెళ్లి రాత్రి ఏ పది, 11 గంటలకో ఇంటికి చేరుకునే ఎస్పీకి ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో అని తొలుత సంశయించారు. అయితే, ఆకలి వారి ఆలోచనను దాటింది. ఏదైతే అది జరుగుతుందని ఓ మహిళ ఎస్పీ బి. రాజకుమారికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. తాము మూడు రోజులుగా నడుస్తున్నామని ఏమీ తినలేదని తెలిపారు. తాము 11 మంది ఉన్నారని చెప్పారు. ఆ ఫోన్ కాల్తో ఎస్పీ గుండెను తడిమింది.
క్వారంటైన్ కేంద్రంలో వలస కూలీలతో మాట్లాడుతున్న ఎస్పీ రాజకుమారి
వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఆ సమయంలో ఏమైనా తినడానికి దొరుకుతాయా? అని అడిగారు. ఆ సమయంలో బ్రెడ్ మాత్రం తీసుకురాగలమని వారు చెప్పారు. మూడు రోజులుగా ఏమీ తినకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వారికి, బ్రెడ్ ఏ మాత్రం కడుపు నింపదు. ఆ బ్రెడ్ కోసం కూడా ఎక్కడెక్కడో వెతికి తీసుకురావాలి. దీంతో ఇక లాభం లేదని తానే నడుం బిగించారు. వెంటనే అన్నం వండారు. ఇంట్లో ఉన్న నిమ్మకాయలతో లెమన్ రైస్ కలిపారు. వాటిని పొట్లాలు కట్టారు. ఆ పొట్లాలను తీసుకుని వచ్చి వలస కూలీలకు అందజేశారు. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది.
క్వారంటైన్ కేంద్రం వద్ద పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న విజయనగరం ఎస్పీ రాజకుమారి
అర్ధరాత్రి ఫోన్ చేశారని విసుక్కోకుండా ఓ ఎస్పీ స్వయంగా వంట చేసి ఒంటి గంట సమయంలో స్వయంగా తీసుకొచ్చి తమకు అందించడంతో ఆ వలస కూలీలకు కన్నీళ్లు ఆగలేదు. తమ గోడు అంతా చెప్పుకొన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, వారు ఎవరూ తొందరపడి ఇళ్లకు వెళ్లవద్దని ఆమె వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం వారికి క్వారంటైన్ స్టాంపులు వేసిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని స్పష్టం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.