news18-telugu
Updated: September 17, 2020, 11:19 AM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్ళు నడపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వలస కార్మికులు, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సొంత ప్రాంతాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్న ప్రజల సౌకర్యార్ధం సామాజిక బాధ్యతతో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్ళు నడుపుతోంది. అవసరాలకు తగినన్ని లేకపోయినప్పటికీ ఈ ప్రత్యేక రైళ్ళు ప్రజలకు కొంత ఉపయుక్తంగా ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే ప్రత్యేక రైళ్ళ సంఖ్య అతిస్వల్పంగా ఉన్నందున రిజర్వేషన్ దొరకక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని విజయసాయిరెడ్డి, రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లాక్ డౌన్ సడలింపు అనంతరం ఇటీవల రైల్వే శాఖ అంతర్ రాష్ట్ర ప్రయాణీకుల సౌకర్యార్ధం 80 ప్రత్యేక రైళ్ళను ప్రారంభించింది. కానీ వాటిలో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి నగరాల మధ్య ఒక్క ప్రత్యేక రైలు కూడా లేని విషయాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రజా రవాణా (బస్సులు) ఇంకా ప్రారంభం కానుందున రవాణా కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యధికంగా ప్రజలు రాకపోకలు సాగించే విశాఖపట్నం, తిరుపతి మార్గాలలో ప్రజా రవాణా చాలా పరిమిత సంఖ్యలో ఉన్నందున్న సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఖర్చు చేయలేని స్థితిలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదారాబాద్ నుంచి విశాఖపట్నం, హైదరాబద్ నుంచి తిరుపతి నగరాల మధ్య ప్రత్యేక రైళ్ళను వెంటనే ప్రవేశపెట్టాలని ఆయన రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Published by:
Sumanth Kanukula
First published:
September 17, 2020, 11:18 AM IST