news18-telugu
Updated: November 24, 2020, 9:04 PM IST
అధికారులు అడ్డుకోవడంతో ఆగిపోయిన కలెక్టర్
ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు తిరుమలలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఏకంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తానే వారు అడ్డుకోవడం పలు విమర్శలకు దారి తీసింది. ఆలయం లోనికి అనుమతి లేదంటూ మహాద్వారం వద్ద టీడీపీ విజిలెన్స్ సిబ్బంది కలెక్టర్ తో సహా పలువురు కీలక అధికారులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఎస్పీ విజయారావు, సీఎంవో అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులులోనికి అనుమతించలేదు. తాను జిల్లా కలెక్టర్ ని అని చెప్పినా అనుమతించకపోవడంతో కలెక్టర్ భరత్ గుప్తా వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్లలేక కాసేపు అక్కడే ఉండిపోయారు.
దీంతో కలెక్టర్ ఫోన్‌లో ఇతర అధికారులకు విషయాన్ని వివరించారు. స్పందించిన అదనపు ఎస్పీ సుప్రజ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ అధికారులను దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు. ఏకంగా రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ పర్యవేక్షణ అధికారి పట్ల విజిలెన్స్ సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో బసంత్‌కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందం స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌కి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 24, 2020, 8:44 PM IST