Brahma Kamal: విశాఖలో విరబూసిన బ్రహ్మ కమలం.. రాత్రి ప్రత్యేక పూజలు.. ఈ పుష్పం ప్రత్యేకత తెలుసా..?

విశాఖలో అరుదైన బ్రహ్మ కమలం

విశాఖలో అరుదైన పుష్పం విరబూసింది. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే బ్రహ్మకమలం పుష్పానికి విశాఖలో ప్రత్యేక పూజలు చేశారు. చాలా అరుదైన ఈ పుష్పాన్ని చూసేందుకు భారీగా వస్తున్నారు.

  • Share this:
    పుష్పాలలో చాలా అరుదైనది బ్రహ్మ కమలం.. ఇది ఈ పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూస్తుంది. అందుకే దీన్ని ఎంతో ఆరుదుగా చూస్తారు. తాజాగా విశాఖ జిల్లా కొయ్యూరు మండ‌లం డౌనూరు గ్రామంలో బోనంగి ప్రసాద్ మాస్టారు ఇంటిలో బ్రహ్మకమలం వికసించింది. దీంతో మహిళలు భక్తి శ్రద్ధలతో ఆ పుష్పానికి ప్రత్యేక పూజలు చేశారు. చాలా అరుదైనది.. పత్యేకత గల పుష్పం త‌మ‌ గ్రామంలో విక‌సించ‌డంతో స్థానికులు ఆనందోత్సాహాలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ సతీమణి సత్యవతి మాట్లాడుతూ తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క‌ నాటామన్నారు. తాజాగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసింద‌ని ఆమె చెప్పారు.

    ఈ బ్రహ్మకమలానికి ఎంతో ప్రత్యేకమైంది. బ్రహ్మ కమలం అంటే బ్రహ్మ కూర్చునే పువ్వు అనే అర్థం. హైందవ సంప్రదాయంలో దీనికి చాలా విశిష్ఠ‌త‌ ఉంది. ఈ పుష్పం మన జనారణ్యంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. దీన్ని పెంచేవాళ్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఇది హిమాలయాల్లో దొరికే చాలా అరుదైన మొక్క.. ఇ మొక్కను ఇంట్లో ఉంచితే మంచిదని హిందువులు భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

    ఈ బ్రహ్మ కమలాన్ని ప్రకృతి ఇచ్చిన వరంగా హిందువులు భావిస్తారు. అందకే వికసించిన రోజే ఆ పుష్పానికి ప్రత్యేక పూజలు చేస్తారు. బ్రహ్మ కమలం అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినదిగా పురాణాల్లో ఉంది. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని పెద్దలు చెబుతారు. బ్రహ్మ ఉద్భవించినందునే దీన్ని బ్రహ్మకమలం అంటారు. ఈ బ్రహ్మకమలము ఒక చిత్రమైన పుష్ప రాజము. ఈ పుష్పాలతో దేవుడ్ని పూజిస్తే మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా తీరుతాయన్నది చాలామంది నమ్మకం.

    లక్ష్మీ, సరస్వతీ దేవతల ఆశీనులయ్యేదిగా ఈ పుష్ప గురించి పూర్వీకులు చెబుతుంటారు. దేవతలు సాధారణ కమలాల మీద కూర్చోరని కేవలం ఇలా బ్రహ్మ కమలంపైనే కూర్చుంటారని కొన్ని గ్రంధాల్లో కథనాలు ఉన్నాయి. దేవ లోకాల్లోని బ్రహ్మ కమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయంటారు. సుమారు 12 వేల అడుగుల ఎత్తులో వున్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒకసారి ఈ బ్రహ్మకమలం పూస్తుంది అని చెబుతుంటారు. అది కూడా కేవలం రాత్రి సమయంలోనే వికసిస్తుంది.
    Published by:Nagesh Paina
    First published: