VEGETABLE VENDORS TRIED TO ATTACK ON MUNICIPAL COMMISSIONEW IN PRODDUTUR TOWN OF YSR KADAPA DISCTRICT HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: చిచ్చు రేపిన కూరగాయల మార్కెట్.. ప్రాణభయంతో పరుగులు పెట్టిన మహిళా అధికారి
కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్లో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa Disctrict) ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వ్యాపారులు తిరగబడటంతో టెన్షన్ వాతావరణ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. కూరగాయల మార్కెట్‌ను తొలగించేందుకు వెళ్ళిన మున్సిపల్ కమీషనర్‌కు, కూరగాయాల వ్యాపారులకు మధ్య జరిగిన ఘర్షణ చివరకు రాళ్ల దాడివరకు వెళ్లింది. దీంతో మార్కెట్ వ్యాపారులకు, మున్సిపల్ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ రేగింది. మున్సిపల్ అధికారులపై వ్యాపారస్తులు రాళ్ళదాడికి దిగగా.. వారిపై మున్సిపల్ కార్మికులు ప్రతిదాడికి యత్నించారు. దీంతో ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ రణరంగంగా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్‌ను కూల్చి, ఆధునీకరించాలన్న ప్రతిపాదనలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇప్పుడున్న మార్కెట్‌ను, ఇతర వ్యాపార సముదాయాలను తొలగించి, దీని స్థానంలో కొత్త షాపులు, మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
దీనిపై వ్యాపారులతో, నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే తొలుత మార్కెట్ తొలగింపుకు అంగీకరించిన వ్యాపారులు.. ఆ తర్వాత తొలగింపును అడ్డుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం మార్కెట్ లో షాపులు కూల్చేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను వ్యాపారులు అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషన్ ఎన్.రాధ, ఇతర మున్సిపల్ సిబ్బందిపై వ్యాపారులు రాళ్లదాడికి దిగారు. దీంతో దాడుల నుంచి తప్పించుకునేందుకు అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాధ.. పరుగులు పెట్టుకుంటూ వెళ్లి ఓ షాపులో దాక్కున్నారు. మున్సిపల్ కార్మికులు ఆమెకు రక్షణగా నిలిచారు.
ఆ తరువాత మున్సిపల్ కార్మికులు.. అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రతి దాడులకు దిగారు. దీంతో కాసేపు మార్కెట్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఐతే పోలీసుల ఎదుటే కొందరు మున్సిపల్ కార్మికులను వ్యాపారులు కొట్టడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.మున్సిల్ అధికారులపై దాడులకు దిగిన వారిపై కేసులు నమోదు చేయాలని కమీషనర్‌కు సూచించారు.
ఇదిలా ఉండగా మార్కెట్ వ్యవహారంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య జరుగుతున్న వివాదంలో మధ్యే మార్గం అనుసరించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నాయని, మార్కెట్ తరలింపుపై ఉన్న ఉత్తర్వులను పాటించాలని, తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు అయ్యే వరకు ఇక్కడే కూరగాయలు విక్రయించుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఎమ్మెల్యే శివారెడ్డి చర్చల అనంతరం మార్కెట్లో దుకాణాల కూల్చివేతను యథావిధిగా చేపట్టారు.