Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పూజా విధానం

సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్థిల్లాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చినవారితో వివాహం జరుగుతుందని నమ్మకం.

news18-telugu
Updated: July 31, 2020, 8:26 AM IST
Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పూజా విధానం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణయానం వేసవి చివరలో... వర్షరుతువు ప్రారంభంలో వచ్చేదే శ్రావణమాసం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణయానం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే శ్రావణమాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుని సహోదరి శ్రీ మహాలక్ష్మీ. అందుకే శ్రావణమాసంలో మంగళవారం మంగళగౌరిని.. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీని పూజిస్తారు. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో శ్రీమహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు.

సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణమాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతీరోజూ పండగలా చేసుకుంటారు. శ్రావణమాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మీ... వివిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ.. అందర్నీ కంటికిరెప్పలా కాపాడుతుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వరలక్ష్మిని పూజించడం చాలా శ్రేష్టం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తే.. విశేష ఫలితాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.

వరలక్ష్మీ వ్రత పూజా విధానం

ముఖ్యంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆరోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేయాలి. మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది, కలశాన్ని ఉంచాలి. మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపురంగు రవిక బట్టతో దాన్ని అలంకరించాలి


ఆ కలశం ముందు భాగంంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీని కీర్తిస్తూ.. అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. నవకాయ పిండివంటలు, ఫలాల్ని నైవేద్యంగా సమర్పించాలి. తొమ్మిది దారాలతో తయారు చేసి తోరాన్ని అర్పించాలి. దాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్థిల్లాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.

వరలక్ష్మీ వ్రత పురాణగాధ

దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా.. శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒక్కటే. కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుడ్ని... పార్వతీదేవి స్వామీ..! ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలో స్త్రీలు అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారో చెప్పాలని కోరింది. దీంతో శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీకి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది.
పరమశివుడు ఈ సందర్భంగా తన భక్తురాలైన చారుమతి కథను వివరించాడు. భర్త. అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ సర్వోపచారాలతో చారుమతి వారిని సేవించేది. ఉత్తమ ఇల్లాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహాలక్ష్మిని భక్తి  శ్రద్ధలతో పూజించేది. ఆమె పతివ్రత్యా ధర్మానికి వరలక్ష్మీ మెచ్చి అనుగ్రహించింది.  కలలో లక్ష్మీదేవి కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలిస్తానని చారుమతికి అభయమిస్తుంది. దీంతో లక్ష్మీ దేవి చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి అష్ట ఐశ్వర్యాలన్నీ అందుకుందని శివుడు.. గౌరీదేవికి వివరిస్తాడు. దీంతో సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ క‌ృపకు పాత్రురాలైందని చెబుతుంటారు.


అందుకే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా  పెద్ద ఎత్తున  వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. పూలు, పళ్లు, ప్రసాదాలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అలాగే పెళ్లికాని కన్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చినవారితో వివాహం జరుగుతుందని నమ్మకం. ముత్తైదువులు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాల్ని పూజలో ఉంచి దానిని ధరించడం వల్ల సుఖసంతోషాలు వెల్లివిరిసి...దీర్ఘ సుమంగళిగా ఉంటారని  విశ్వసిస్తారు.
Published by: Sulthana Begum Shaik
First published: July 31, 2020, 8:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading