తిరుమలకు సంబంధించిన సేవలు, దర్శనాల విషయంలో కొన్ని నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడం.. వీటి కారణంగా భక్తులు మోసపోవడం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇలాంటి వెబ్సైట్లపై టీటీడీ కూడా సీరియస్ అయ్యింది. వీటిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశంపై టీటీడీ మరోసారి స్పందించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం అందిస్తామని సోషల్ మీడియాలో నకిలీ వెబ్సైట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఈఓ జవహర్‌రెడ్డి భక్తులను కోరారు. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్సైట్ www.tirupatibalaji.ap.gov.inను మాత్రమే వినియోగించాలని సూచించారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబరు 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తామని అన్నారు. డిసెంబరు 10వ తేదీ నుండి ఆన్లైన్లో ఈ గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రోజుకు 20 వేలు చొప్పున ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేశామని అన్నారు. కరెంట్ బుకింగ్ ద్వారా పదివేల టికెట్లు ఈ నెల 24న భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుందని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తెలిపారు.
తిరుమలలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పురాణాల్లో పేర్కొన్న విధంగాశ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నామని జవహర్ రెడ్డి తెలిపారు. గోసంరక్షణ కోసం డిసెంబరు 7న విజయవాడ కనకదుర్గ ఆలయంలో, 10న హైదరాబాద్‌లోని శ్రీవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.
ఇక నవంబర్ నెలలో శ్రీవారిని 8.47 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.61.29 కోట్లు ఆదాయం లభించింది. తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు - రూ.3.75 కోట్లు వచ్చింది. నవంబర్ నెలలో భక్తులకు 50.04 లడ్డూలు విక్రయించారు. శ్రీవారి అన్నప్రసాద కేంద్రంలో 8.99 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 2.92 లక్షల మంది భక్తులు గత నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala news, Ttd