తెలుగు రాష్ట్రాల జల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. కేంద్రం ఇటీవల జారీచేసిన గెటిట్ నోటిఫికేషన్ మరింత చిచ్చుపెట్టింది. కేంద్రం నిర్ణయాన్ని ఏపీ స్వాగతించగా.. తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ జగడంపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రశ్న లేవనెత్తారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని.. వాటి వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇష్టానుసారం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ తమ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు పోలవరం అంశంపై చర్చకు వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ ఎంపీలు నినాదాలు చేస్తుండగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఐతే ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా తమ సమస్యలపై ఆందోళనకు దిగారు. వాటిపై చర్చ జరగాలని పట్టుబట్టారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు. ఐనా ఎవరూ వినలేదు. వెల్‌లో ఆందోళన కొనసాగిచండంతో... స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, ఏపీ, తెలంగాణలో నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులపై ఆయా బోర్డులదే పెత్తమని కేంద్రం స్పష్టం చేసింది. వాటి నిర్వహణ బాధ్యతను ఇక నుంచి బోర్డులే నిర్వర్తిస్తాయి. ప్రాజెక్టుల భద్రత కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుంది. నది యాజమాన్య బోర్డుల్లో తెలుగు రాష్ట్రాల వారు ఉండబోరు. బోర్డు ఛైర్మన్‌తో పాటు సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు కూడా ఇతర రాష్ట్రాల వారే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల హెడ్‌వర్క్‌లు, బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్‌వర్క్స్, ట్రాన్స్‌మిషన్ లైన్లు కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయి. నీళ్లు విడుదల, విద్యుత్ ఉత్పత్తిని కూడా బోర్డే పర్యవేక్షిస్తుంది. అక్టోబరు 14 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది.
ఏపీ, తెలంగాణ ఒక్కో బోర్డుకు సీడ్ మనీ కింద రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్ చేయాలి. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు రాకుంటే ఆ ప్రాజెక్టులు అప్పటికే పూర్తైనా.. నిలిపివేయాలి. వాటికి ఎలాంటి కేటాయింపులు ఉండవు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కేంద్రం పక్షపాతంగా వ్యహరిస్తోందని.. తెలంగాణ హక్కులను కాలరాస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్‌లో కొట్లాడాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఇప్పటకే సూచించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Telangana Water Fight, Krishna River, Krishna River Management Board, Lok sabha