UNION HOME MINISTER AMIT SHAH RECEIVES WARM WELCOME AT TIRUPATI AIRPORT BY AP CM JAGAN SZC MEETING ON SUNDAY MKS TPT
amit shah : అమిత్ షా ఏపీ పర్యటన -ఘనస్వాగతం పలికిన సీఎం జగన్ -szc భేటీకి కేసీఆర్ డుమ్మా
రేణిగుంట విమానాశ్రయంలో అమిత్ షాకు జగన్ స్వాగం
రెండు రోజుల పర్యటన కోసం ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఘనస్వాగతం లభించింది. సీఎం జగన్ స్వయంగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి షాకు స్వాగతం పలికి సన్మానించారు. ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారి సందర్శనకు వెళ్లారు. ఆదివారం తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల ఏపీ పర్యటన మొదలైంది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. షా విమానం దిగీదిగగానే స్వాగతం చెప్పిన సీఎం జగన్.. కేంద్ర మంత్రిని షాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు. షా రాక సందర్భంగా ప్రభుత్వ అధికారులతోపాటు వైసీపీ, బీజేపీ కీలక నేతలతో రేణిగుంట విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది.
మారిన షెడ్యూల్ ప్రకారం, అమిత్ షా రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సీఎం జగన్ కూడా ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత జగన్ తాడేపల్లికి తిరిగిరానుండగా, అమిత్ షా మాత్రం తిరుపతిలోని తాజ్ హోటల్ లో బస చేయనున్నారు. షా రాక సందర్భంగా తిరుపతిలో బీజేపీ నేతల సందడి పెరిగింది. హోటల్ లో షాను కలిసేందుకు ఏపీ కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి పర్యటన, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక సందర్భంగా తిరుపతిలో కనీవినీ ఎరుగని భద్రత కల్పించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ స్వాగతం
ఏపీ పర్యటన రెండో రోజు షెడ్యూల్ లో భాగంగా అమిత్ షా ఆదివారం ఉదయం నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టుకు వెళతారు. మధ్యాహ్నం మళ్లీ తిరుపతికి తిరిగొచ్చి, కీలకమైన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ సమావేశానికి ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతోపాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరువుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి గైర్హాజరవుతారు. తెలంగాణ ప్రతినిధిగా హోం మంత్రి మహమూద్ అలీ హాజరవుతారు.
అయితే ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం తిరుపతికి వచ్చి.. ఆదివారం పలు కార్యక్రమాల తర్వాత సోమవారం శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. మారిన షెడ్యూల్ ప్రకారం మూడు రోజుల పర్యటనను రెండు రోజుల్లోనే ముగియనున్నారు. అమిత్ షా బస చేయనున్న హోటల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.