నేడు కేంద్ర కేబినెట్ భేటీ... 16వ లోక్ సభ రద్దుకు సిఫార్సు...

ఎన్డీయేకి 352 సీట్లు వచ్చాయి. బీజేపీకి సొంతంగా 303 సీట్లు వచ్చాయి.

Lok Sabha Election Results 2019 : లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ... మరోసారి అధికారంలోకి వచ్చేందుకు... ప్రస్తుత లోక్ సభను రద్దు చేయబోతోంది.

  • Share this:
2014లో నరేంద్ర మోదీ వేవ్‌తో దుమ్మురేపిన బీజేపీ... ఈసారి మరింత బలంగా మారి... ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకొని... తిరుగులేని శక్తిగా మారింది. మరో ఐదేళ్లు పాలించేందుకు ఆలస్యం చేయకుండా... ప్రస్తుత 16వ లోక్ సభను రద్దు చేసేలా సిఫార్సు చేసేందుకు ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ మీటింగ్‌లో మంత్రులతోపాటూ... సహాయ మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధాని ఆఫీస్‌లోని సౌత్ బ్లాక్‌లో ఇది జరగబోతోంది. కేబినెట్ తీర్మానం తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తారు. నిజానికి ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉంది. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. రెండ్రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై కొత్తగా ఎన్నికైన లోక్ సభ అభ్యర్థుల జాబితాను అందజేస్తారు. జూన్ 3 లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు.

కొత్త కేబినెట్‌లో పార్టీ చీఫ్ అమిత్‌షాకు కీలక పదవి ఇస్తారని తెలుస్తోంది. తొలిసారి లోక్ సభలో అడుగుపెడుతున్న ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారని సమాచారం. భద్రతా దళాల కేబినెట్ కమిటీలో అమిత్ షాను తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ కమిటీలో... రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. గుజరాత్‌లో మోడీ సీఎంగా ఉన్నప్పుడు... అమిత్ షా... హోంశాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో రాజ్ నాథ్ సింగ్.. హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తిరిగి లక్నో స్థానం నుంచీ ఎన్నికవడంతో... ఆ శాఖను ఆయనకే ఉంచుతారా, మార్చుతారా అన్నది తేలాల్సి ఉంది.

ఇక రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాగానే చేశారు. ముఖ్యంగా రాఫెల్ డీల్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. అందువల్ల ఆమెను ఆ శాఖ నుంచీ తప్పిస్తారా అన్నది అనుమానమే. మరో కీలకమైన రైల్వే శాఖకు మంత్రిగా పియూష్ గోయల్ మంచి మార్కులు సంపాదించారు. అందువల్ల ఆయన్ని తప్పించి అమిత్ షాకి ఆ శాఖను ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆ పదవిలో కొనసాగిస్తారా అన్నది మాత్రం అనుమానంగా ఉంది. ఆయనకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతుండటమే ఇందుకు కారణం. ఫలితాలు విడుదలైన గురువారం రోజున ఆయన ఎయిమ్స్ నుంచీ డిశ్చార్జి అయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాల్లో కూడా ఆయన పాల్గొనలేదు. అందువల్ల ఆయన్ని తప్పించి... ఆ పదవిని అమిత్ షాకి ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది.

ఇక విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్న సుష్మస్వరాజ్... ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ప్రస్తుతం ఆమె రెండు సభల్లోనూ సభ్యురాలిగా లేరు. ఐతే, టెక్స్‌టైల్స్ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ... అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఓడించి... బీజేపీలో కీలక శక్తిగా ఎదిగారు. అందువల్ల ఆమెకు మరింత కీలక శాఖ ఇస్తారని తెలుస్తోంది. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ సైతం... ఏళ్లుగా రాజ్యసభలో ఉంటూ... తొలిసారి లోక్ సభకు వస్తున్నారు. ఇలా కీలక పదవులకు కీలక వ్యక్తులు చాలా మంది బీజేపీలో ఉండటంతో... ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?

వైసీపీలోకి ఉండవల్లి... రావడమే లేటు...
First published: