ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేదంటారు. కానీ ఈ శిశువు విషయంలో మాత్రం తల్లిని మించిన కఠినాత్మురాలు లేదేమో అనిపిస్తుంది. నవమాసాలు మోసి, తీరా బిడ్డ పుట్టిన తర్వాత అత్యంత కర్కశంగా రైలు టాయిలెట్ లో వదిలేసి వెళ్లిపోయిందో మహాత్మురాలు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సర్వత్రా కలతరేపింది. వివరాలివి..
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బొకారా ఎక్స్ ప్రెస్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ బిడ్డను ప్రసవించి, ఆ శిశువును రైలు టాయిలెట్ లోనే వదిలేసి వెళ్లింది. ధన్బాద్(జార్ఖండ్) - అలప్పుజా (కేరళ) మధ్య నడిచే బొకారో ఎక్స్ ప్రెస్ రైలు వైజాగ్ లో స్టేషన్ రావడానికి ముందు టాయిలెట్ లో నుంచి అరుపులు వినిపించడంతో ప్రయాణికులు వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన పసికందు కంటపడింది. వెంటనే బిడ్డను టాయిలెట్ లో నుంచి బయటికి తీసిన ప్రయాణికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
బొకారా ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం స్టేషన్ చేరుకునే సమాయానికి స్థానిక ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వైద్య సిబ్బందితో సమాయత్తం అయ్యారు. రైలు ఆగిన వెంటనే పాపను పరీక్షించి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రైల్వే మహిళా పోలీసులు అప్పుడే పుట్టిన శిశువును ఎత్తుకొని వస్తున్న దృశ్యం అందరినీ కంటతడిపెట్టింది. శిశువును అక్కున చేర్చుకుని వెంటనే రైల్వే ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు విశాఖపట్నం పరిధిలోని రైల్వే పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును కావాలనే టాయిలెట్ లో వదిలేసి వెళ్లిపోయారా? లేక ఏమరుపాటున ఇలా జరిగిందా? అసలు బిడ్డను కన్న ప్రయాణికురాలు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికిపట్టే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు. ప్రయాణికుల లిస్టుతోపాటు ఆయా స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తల్లిని కనిపెట్టే ప్రయత్నం చేస్తామని రైల్వే పోలీసులు చెప్పారు. నెలలు నిండిన గర్భిణులు రైల్వే టాయిలెట్ లో బిడ్డను ప్రసవించి, ఆ విషయాన్ని గుర్తించలేకుండా ఏమరుపాటుగా వ్యవహరించిన అరుదైన ఘటనలు కొన్ని గతంలో వెలుగులోకి వచ్చాయి. ఇవాళ్టి ఘటన అలాంటిదా? లేక కన్నతల్లి కర్కశమా? ఇంకేదైనా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India Railways, New born baby, Railway Police, Toilet, Train, Visakhapatnam