చదువుల తల్లి అనే మాటకు అసలు సిసలు రూపంగా పెరిగిందామె.. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మొక్కవోని దీక్షతో ముందుకెళ్లింది.. ఉండే ఇల్లు పూర్తిగా పాతదైపోయినా, ఉద్యోగ సాధనపైనే దృష్టిపెట్టి రేయింబవళ్లు కష్టపడింది.. అయితే ఇటీవలి వరదలు (AP Floods) ఆమె కలల్ని బలవంతంగా కొట్టేసుకునిపోయాయి.. భారీ వర్షాల ధాటికి ఇల్లు ధ్వంసమైపోగా, దాతల సహాయంతో వేరే గూటిలో తలదాచుకోవాల్సి వచ్చింది. కుటుంబమంతా బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తోన్న దృశ్యాన్ని తట్టుకోలేకపోయిందో ఏమో, చదువుల తల్లి ప్రియ బలవన్మరణానికి పాల్పడింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నియోజకవర్గం, ఇటీవలే సీఎం జగన్ (CM Jagan) పార్టీ విజయం సాధించిన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేస్తున్నది. వివరాలివి..
ఓవైపు నిరుద్యోగం, మరోవైపు కటిక దారిద్య్రం, పైగా చెల్లెలి అనారోగ్యం.. అన్నిటికీ తాను ఉద్యోగం సాధించడం ఒక్కటే పరిష్కారం. ఆ దిశగా ఆమె అలుపెరుగని పోరాటమే చేసింది. కానీ, మొన్నటి భారీ వర్షాలకు ఉన్న ఇల్లు దాదాపు దెబ్బతినడంతో దాతలు ఇచ్చిన వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. తన కోసం తల్లిదండ్రులు పడుతోన్న కష్టాన్ని చూడలేక ఆ చిట్టితల్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది.
కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి గ్రామానికి చెందిన జానకిరామ్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు ప్రియ(24), చిన్న కూతురు ఝాన్సీ. చిన్నప్పటి నుంచీ చదవుల్లో ముందుండే ప్రియ.. కార్వేటినగరంలో టీటీసీ పూర్తి చేసింది. టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష డీఎస్సీలోనూ క్వాలిఫై అయి..ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇతర ప్రయత్నాల్లో భాగంగా..
ఇటీవలే ఆర్ఆర్బీ పరీక్ష రాయగా, ఒకే ఒక్క మార్కు తేడాలో అవకాశం చేజారింది. టీటీసీతోపాటే ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. గ్రామ సచివాలయంలోనో మరో చోటో ఉద్యోగం రాకపోదనే గంపెడాశతో ఎదురుచూస్తోంది. ఆదివారం తిరుపతి లో ప్రాక్టికల్ పరీక్షరాసి, స్వగ్రామం గుడుపల్లికి వచ్చిన ప్రియ.. అనూహ్య రీతిలో సోమవారం రాత్రి ఇంటికి సమీపంలోని ట్రాక్ పైకి వెళ్లి రైలు కింద పడి చనిపోయింది.
నిరోద్యోగ యువతి ప్రియ ఆత్మహత్య ఉదంతం స్థానికులను కదిలిచింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులకుతోడు తాజా జలప్రళయం కుటుంబాన్ని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేయడంతో ప్రియ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఈ పనికి పూనుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియ ఆత్మహత్య ఘటనపై కుప్పం రైల్వే ఎస్సై కె. బలరాం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Floods, Chitoor, Kuppam, Unemployment, Woman suicide