చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

ఉండవల్లి అరుణ్ కుమార్, చంద్రబాబు

AP Lok Sabha Election 2019 : ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకు పైగా టైమ్ ఉంది. ఈలోగా నేతలు తమదైన వ్యూహాలతో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా...

  • Share this:
కేంద్రంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి... ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంటే... ప్రధాని పీఠం టీడీపీ అధినేత చంద్రబాబుకి దక్కే అవకాశం ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మోదీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చెయ్యడంలో, మోదీని వ్యతిరేకించడంలో మమతా బెనర్జీ, మాయావతి కంటే చంద్రబాబే ముందు ఉన్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పది కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కితే, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఐతే... ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే ప్రచారం మొదలైంది. ప్రత్యర్థుల్ని తెలివిగా ఇరికించడంలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న ఉండవల్లి... చంద్రబాబును అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కామెంట్లు చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు ప్లాన్ ఇదీ : ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడంపైనే చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. అదే సమయంలో... కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉంటే... మరో ఐదేళ్లపాటూ ఏపీలో తమ పాలనకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవనీ, అందువల్ల బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో వచ్చేందుకు జాతీయ స్థాయిలో చంద్రబాబు వివిధ పార్టీల నేతలను కలిసి, చర్చలు జరుపుతున్నారు. అంతమాత్రాన చంద్రబాబు ప్రధాని అయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు కాదంటున్నారు విశ్లేషకులు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కంటే... మమతా బెనర్జీ, మాయావతి లాంటి వాళ్లు ప్రధాని పీఠం కోసం ఎక్కువగా వ్యూహాలు రచిస్తున్నారనీ, ఇక కాంగ్రెస్ నుంచీ అధ్యక్షుడు రాహుల్ ఎలాగూ అదే పనిలో ఉన్నారనీ... అందువల్ల వాళ్లను దాటి చంద్రబాబు ఆ పీఠాన్ని దక్కించుకోవడం సాధ్యపడదని అంటున్నారు.

ఉండవల్లి వ్యూహం అదేనా : ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనీ, ఉండవల్లి వైసీపీలో చేరి... జగన్ కేబినెట్‌లో కీలక మంత్రి పదవి దక్కించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబు పెడుతున్న ఫోకస్‌ను దారి మళ్లించేందుకూ... ఈవీఎంలు, వీవీప్యాట్లపై దృష్టి పెడుతున్న చంద్రబాబును అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఉండవల్లి ఇలా మాట్లాడారనే కామెంట్లు వినిపిస్తున్నా్యి. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగితే, కౌంటింగ్‌పై టీడీపీ ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తకుండా ఉంటే, ఫలితం కచ్చితంగా వైసీపీకే అనుకూలంగా ఉంటుందని ఉండవల్లితోపాటూ వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అలా జరగాలంటే ఈవీఎంలపై ఉద్యమం విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాలి. అప్పుడు ప్రశాంతంగా వైసీపీకి అధికారం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అందువల్లే చంద్రబాబుకి ప్రధాని పీఠంపై ఆశలు రేకెత్తించేందుకు ఉండవల్లితో అలాంటి వ్యాఖ్యలు చేయించి ఉండారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతానికి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. తాను తిరిగి సీఎం అవ్వాలనీ, రాజధాని నిర్మాణం పూర్తి చెయ్యాలనే ఆలోచనల్లోనే చంద్రబాబు ఉన్నారు. ఐతే, రాజధాని పూర్తవ్వాలంటే... కేంద్రం నుంచీ భారీ ఎత్తున నిధులు రావాల్సి ఉంటుంది. అందువల్ల కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ ఏపీలో టీడీపీ ఓడిపోయి... పది కంటే ఎంపీ స్థానాలు గెలిచినా... కేంద్రంలో చక్రం తిప్పగలరే తప్ప... ప్రధాని పీఠాన్ని మిగతా పార్టీలు చంద్రబాబుకి అప్పగించే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు. ఏపీలో టీడీపీ గెలిచి, 10 కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించున్నా... అప్పుడు కూడా చంద్రబాబును ఏపీకే పరిమితం చెయ్యాలని పార్టీలు భావిస్తాయే తప్ప... ఆయన్ని ప్రధాని రేసులో నిలబెట్టేందుకు పార్టీలు ముందుకు రావంటున్నారు. అందువల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యల వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అభివర్ణిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

నేడు MRPS మహా గర్జన... దద్దరిల్లనున్న ధర్నాచౌక్

డబ్బులిస్తానంటూ పిలిచి కుమ్మేసిన మహిళ... నకిలీ ఏసీబీ అధికారికి దేహశుద్ధి...
First published: