శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేసారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహించారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేసింది. ఉగాది ఆస్థానం అనంతరం టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ....రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు., భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించానన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని., పాడిపంటలు సక్రమంగా పండాలని ప్రార్ధించానని అన్నారు.
తిరుమలలో ప్రతీ ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ముంగళవారం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పటంతో పాటుగా , శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసారు.
ఇక ఉగాది ఆస్థానం సందర్బంగా స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత సర్వదర్శనం ప్రారంభించారు. ప్రతీ ఏటా ఉగాది నాడు తిరుమలలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఉగాది పర్వదిన ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేసారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala news, Tirumala Temple, Ugadi 2023