తెలంగాణలో ఒక సర్జికల్ స్ర్టయిక్ అవసరమైతే… ఏపీలో రెండు ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రయిక్స్ అవసరం అవుతాయని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఓటర్లు వైసీపీ, టీడీపీపై ఓటు ద్వారా సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని ఆయన అన్నారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ రెండూ హిందూ వ్యతిరేక విధానాలనే అవలంభిస్తున్నాయని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు తనకు తాను హిందూ అనుకూలవాదినని చెప్పుకునే ప్రయత్నం చేస్తారని... కానీ ఆయన కూడా అంతే అని విమర్శించారు. 3200 కోట్ల బడ్జెట్ టీటీడీ బడ్జెట్లో హిందూ మత ప్రచారానికి కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
దీన్ని బట్టి ప్రభుత్వం విధానం ఏంటో అర్థమవుతోందని మండిపడ్డారు. ఇటీవల ఓ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సంబరాలు చేయడాన్ని ప్రస్తావించిన జీవీఎల్ నరసింహారావు.. దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. క్రిస్టియానిటీని ప్రభుత్వం ప్రమోట్ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను అధికారులు, రాజకీయ నేతలు ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రైస్తవ టోపీలతో పోలీస్ స్టేషన్లో పని చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా దసరా సంబరాలు చేశారా ? అని అన్నారు.
ఒక మతాన్ని అధికారంతో తీసుకురావటానికే ఇలాంటి చర్యలు అని అయన కామెంట్ చేశారు. పోలీస్ స్టేషన్ మత ప్రచారానికి వేదిక కాదని అన్నారు. అయ్యప్ప మాల వేసినపుడు, బొట్టు పెట్టినపుడు అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం ఇలా సామూహికంగా క్రిస్మస్ వేడుకలు పోలీస్ స్టేషన్లో నిర్వహింపజేస్తారని అన్నారు. వైసీపీప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న మత మార్పిడిలపై బీజేపీ తీవ్రంగా పోరాడుతుందని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:December 13, 2020, 18:22 IST