Road Accident in AP: అది అనంతపురం జిల్లా... బత్తలపల్లి మండలం... రాఘవంపల్లి. అంతా చీకటిగా ఉంది. వీధి లైట్లు పెద్దగా వెలగట్లేదు. అక్కడి హైవేపై శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన 2 రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. ముందుగా ఓ బైక్‌పై బత్తలపల్లి నుంచి రాఘవంపల్లికి వెళ్తున్న 29 ఏళ్ల రాజశేఖర్ అనే యువకుడి వెనకాలే ఓ కారు వచ్చింది. సరిగ్గా రాఘవం పల్లి దగ్గరకు రాగానే... భారీ శబ్దం. కట్ చేస్తే... బైకును కారు వెనక నుంచి బలంగా ఢీ కొట్టడంతో... ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి... ఎడమనుంచి కుడివైపు రోడ్డుపై పడి అక్కడికక్కడే చనిపోయాడు రాజశేఖర్. అది చూసిన స్థానికులు... "అయ్యో... అయ్యో... ఎంత పనైంది... దేవుడా... ఇలా అయ్యిందేంటి... ఎవరా కుర్రాడు... చనిపోయాడుగా... అయ్యో" అనుకుంటూ... మృతదేహాన్ని చూసేందుకు రోడ్డుపైకి వెళ్లారు.
సరిగ్గా అప్పుడో ఓ మృత్యు లారీ... దూసుకొచ్చింది. అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న ఆ లారీ చాలా వేగంగా రావడంతో రోడ్డుపై ఉన్న స్థానికులు చెల్లా చెదురుగా పరిగెత్తారు. కానీ... నలుగురు పరిగెత్తేలోపే... లారీ వాళ్లపైకి దూసుకొచ్చింది. ఈ రెండో ప్రమాదంలో బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందిన శివమ్మ(48), సంజీవపురానికి చెందిన వలీసాబ్(52), అదే గ్రామానికి చెందిన సూరి(32), తాడిమర్రి మండలం నార్సంపల్లికి చెందిన శ్రీనివాసులు (49) ప్రాణాలు కోల్పోయారు. అలాగే లింగారెడ్డిపల్లికి చెందిన రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. యువకుడి మరణమే విషాదం అనుకుంటే... మరో నలుగురు చనిపోవడం స్థానికుల్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఇది కూడా చదవండి:Gold Prices Today: 20 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు... నేటి రేట్లు ఇవీ
ఘటనా స్థలానికి వెళ్లిన ధర్మవరం రూరల్ సీఐ చిన్నపెద్దయ్య కేసులు రాసి మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు ప్రమాదాలకు రెండు కేసులు రాసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రోడ్లు చీకటిగానే ఉంటున్నాయి. వాహనాలు నడిపేవారు... త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆలోచనతో చాలా వేగంగా నడుపుతున్నారనీ... దాంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనీ అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, AP News, Road accidents