ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ సమీపంలో ఉన్న టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీకేజ్ తో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూడా బద్దలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 నుంచి 200 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో షిఫ్టుకు దాదాపు 200 మంది ఉద్యోగులు డ్యూటీలు మారతారని స్థానికులు చెప్తున్నారు. గ్యాస్ లీకేజ్ కావడంతో సర్పవరం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మంత్రి కురసాల కన్నబాబు టైకీ పరిశ్రమ వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు. గతంలో కూడా ఇక్కడ గ్యాస్ లీకైనట్లు స్థానికులు చెప్తున్నారు. తాజా ప్రమాదంతో ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయం స్థానికులను వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన తీరుపై పొల్యూషన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు విచరాణ మొదలు పెట్టారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుడిపూడి శ్రీనివాస్ రావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్య సాయిబాబా, రేగళ్లి రాజ్ కుమార్ కు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ ప్రాంతంలో తరచూ గ్యాస్ లీకేజ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గ్యాస్ పైపు లీకేజీలతో పేలుళ్లు సంభవిస్తున్నాయి. మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీ పేలుళ్లు కూడా స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gas leak, Kakinada