GT Hemanth Kumar, Tirupathi, News18
కోటాను కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన దివ్య ధామం తిరుమల (Tirumala Temple). శ్రీవారి దర్శన భాగ్యం కోసం పరితపించిపోతారు భక్తులు. నిత్యం స్వామి వారి సేవలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారిని ఒక్కసారైనా కనులారా చూడాలని వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం చేయని ప్రయత్నాలు ఉండవు. ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న వ్యక్తుల సిపార్సు లేఖలపై మాత్రమే పొందే అవకాశం ఉంది. సిఫార్సు లేఖలను మార్పింగ్ చేస్తూ కొందరు వ్యక్తులు భక్తుల వద్ద భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీని గుర్తించిన దళారీ వ్యవస్థను అరికట్టేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది టీటీడీ.
2019 అక్టోబర్లో టీటీడీ శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ ను తెరపైకి తెచ్చింది. ఈ ట్రస్ట్ కు 10 వేల రూపాయలు విరాళం ఇవ్వడంద్వారా ఒక వ్యక్తికీ ప్రోటోకాల్ దర్శనం కేటాయిస్తోంది. తాజాగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీకి వినూత్న పద్ధతిని అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది.
తిరుపతి ఎయిర్ పోర్టు ను కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN) పథకం కిందకు తీసుకురావడంతో నగరానికి ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. తద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తులు చాలా వరకు విమానాల ద్వారానే తిరుపతి కి చేరుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులు చాలావరకు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొందరైతే అధిక మొత్తంలో సొమ్ము చెల్లించి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలను గుర్తించిన ఏపీ టూరిజం అధికారులు ఓ ప్రతిపాదనను టీటీడీ ముందుంచారు.
దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని టూరిజం శాఖ విజ్ఞప్తి చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ kiosk కౌంటర్ ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులు సూచంచారు. పలు దఫాలు ఈ అంశంపై టూరిజం శాఖా అధికారులతో చర్చించిన టీటీడీ ఉన్నతాధికారులు ఈ తీర్మానాన్ని పాలకమండలిలో ప్రవేశపెట్టారు.
దీనిపై పాలకమండలిలో చర్చించిన సభ్యులు, చైర్మన్ పూర్తి ఆమోదం తెలిపారు. కరెంట్ బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేసే విషయంపై ఎయిర్ పోర్ట్ ఆథారిటీతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చారు. విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ఏర్పాటుకు గతేడాది డిసెంబర్ 4వ తేదీన టీటీడీ ఆర్డర్ కాపీ విడుదల చేసింది. దీంతో టీటీడీ ఇంజనీరింగ్, ఐటీ విభాగం అధికారులు కౌంటర్ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యం కల్పనలో నిమఘ్నమయ్యారు. త్వరోలే ఈ కియోస్క్ శ్రీవారి భక్తులకు అందుబాటులోకి రానుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.