(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)
నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతూ సమస్త భక్త కోటికి కలియుగ వైకుంఠంగా భాసిలుతున్న కేంద్రం తిరుమల. శ్రీవారికి రోజుకో సేవ, వారానికి ఓ సేవ, నెలకు ఓ సేవ, సంవత్సరమంతా సేవలు జరుగుతుంటాయి. ఏడాదికి ఒక మారు సూర్యమానం ప్రకారం కన్యా మాసం శ్రవణా నక్షత్రంకు ముగిసేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని. శ్రీవారి భక్తులకే కాదు, టీటీడి ఉద్యోగులకు కూడా ఇది ప్రత్యేకమైన పండుగే. బ్రహ్మోత్సవ సమయంలో లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలుగకుండా స్వామి వారి దర్శనమే కాదు. స్వామివారి ఊరేగింపు కూడా ప్రత్యక్షంగా తిలకించేందుకు చేసే ఏర్పాట్లు వెనుక టీటీడీ ఉద్యోగులు కష్టం, శ్రమ ఎంతో వుంటుంది. అందుకే.. శ్రీవారికి ప్రత్యేకమైన బ్రహ్మోత్సవాలు భక్తులకు కనులపండుగైన ఉత్సవాలు. టీటీడీ ఉద్యోగులకు పండుగలా వుండాలని 1990 నుంచి బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తూంది టీటీడీ. మొదట టీటీడీ ఉద్యోగులకు మాత్రమే బ్రహ్మోత్సవ బహుమానం అందించేవారు. దీనికి కారణం లేకపోలేదు... అప్పట్లో టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగులు లేరనే చెప్పాలి. మొదట్లో ఉద్యోగుల 15 రోజులు బేసిక్ మొత్తాన్ని బ్రహ్మోత్సవ బహుమానంగా అందించగా... 1991 నుంచి 98 వరకు క్యాడర్ ని బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు బహుమానంగా అందించారు. ఇక 1999 నుంచి 2004 వరకు క్యాడర్ ని బట్టి రూ.1000 నుంచి రూ.2 వేలు వరకు ఉద్యోగులకు బహుమానంగా అందింది. 2005 లో రూ.1500 నుంచి రూ.3000 అందించగా, 2006 నుంచి ప్రతి ఉద్యోగికి సమానంగా బ్రహ్మోత్సవ బహుమానం రూ.3 వేలుగా ఇవ్వాలని అప్పటి పాలకమండలి నిర్ణయించింది. 2007లో రూ.4 వేలు, 2008లో రూ.5 వేలు, 2009 లో రూ.6వేలు, .2010లో రూ.6500, 2011లో రూ.7500 ఉద్యోగులకు ఇవ్వగా... 2012 నుంచి టీటీడీ ఉద్యోగులతో పాటు తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల బహుమానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అప్పటి పాలకమండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు. దీంతో టీటీడీ ఉద్యోగులకు రూ.8 వేలు... కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.4 వేలుగా బ్రహ్మోత్సవ బహుమానంగా ప్రకటించారు. అటు తరువాత 2013 నుంచి బ్రహ్మోత్సవ బహుమానంను టీటీడీ ఉద్యోగులకు ఇస్తూన్న విధంగానే... టీటీడీలో దేశవ్యాప్తంగా వున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి పాలకమండలి చైర్మన్ బాపిరాజు. దీంతో 2013 లో బ్రహ్మోత్సవ బహుమానంగా టీటీడీ ఉద్యోగులకు 10 వేలు,కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.5 వేలు ప్రకటించారు. 2014 లో ఉద్యోగులకు రూ.11 వేలు, కార్మికులకు రూ.5500, 2015 లో ఉద్యోగులకు రూ.12,200, కార్మికులకు రూ.6100, 2016 లో ఉద్యోగులకు రూ.12500, కార్మికులకు రూ.6250, 2017 లో ఉద్యోగులకు రూ.13125, కార్మికులకు రూ.6562, 2018లో ఉద్యోగులకు రూ.13500, కార్మికులకు రూ.6600 బ్రహ్మోత్సవాలు బహుమానం గా అందించింది టీటీడీ.
టీటీడీలో ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన 7800 మంది ఉద్యోగులు వుండగా... కాంట్రాక్టు ఉద్యోగులు 14500 మంది వున్నారు. దీంతో 2018 లో బ్రహ్మోత్సవాలు బహుమానంకు టీటీడీ రూ.20.1 కోట్లు వెచ్చించింది. ఇక గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఎప్పటిలాగానే ఉద్యోగులు బ్రహ్మోత్సవ బహుమానం అంశాన్ని పాలకమండలి అజెండాలో చేర్చారు. గత ఏడాది అక్టోబర్ మాసంలోనే టీటీడీ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7 వేలు వంతున బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించాలని ఆమోదం తెలిపింది చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి. దీంతో బడ్జెట్ రూ.20.85 కోట్లుకు చేరుకుంది. పాలకమండలి ఆమోదించి 10నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తోంది. సాధారణంగా టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించి ప్రభుత్వం నుంచి రాటిఫికేషన్ పొందుతుంది. ఎందుకంటే ఇందులో చెల్లించేది టీటీడీ ఉద్యోగులకు...చెల్లించేది టీటీడి యాజమాన్యమే కాబట్టి...ప్రభుత్వ అనుమతులు లాంఛనంగానే వుండేవి. కానీ 2007 సంవత్సరం నుంచి కూడా ముందుగా ప్రభుత్వ అనుమతులు పోంది...అటు తరువాత ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహూమానం చెల్లించాలని టీటీడిని ఆదేశించింది దేవాదాయశాఖ. దీంతో గత ఏడాది అక్టోబర్ లో పంపిన తీర్మానానికి ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో టీటీడీ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ మాసంలో తిరిగి బ్రహ్మోత్సవం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అసలు బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తారా? ఇవ్వరా అనే అనుమానాలు టీటీడీ ఉద్యోగుల్లో నెలకొంది. ఈ ఆంశం పై టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు నానా హైరానా పడుతు టీటీడీ చైర్మన్ కి, దేవాదాయశాఖ మంత్రికి విజ్ఞప్తులు మీద విజ్ఞప్తులు చేస్తూన్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.
వాస్తవానికి కరోనా కారణంగా టీటీడీ బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యాయి. గత నాలుగు నెలల కాలంలో దాదాపుగా రూ.800 కోట్ల ఆదాయం కోల్పోయింది టీటీడీ. వ్యయం మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనపడటం లేదు. దీంతో టీటీడీ అదనపు వ్యయాన్ని పూర్తిగా నియంత్రిస్తోంది. అందులో భాగంగానే బ్రహ్మోత్సవ బహుమానంను టీటీడీ అదనపు వ్యయంగానే చూస్తూంది. అర్ధికంగా వున్న ఇబ్బందుల నేఫధ్యంలో ప్రభుత్వ అనుమతులపై టీటీడీ దృష్టి సారించలేదు. మరో నెల రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపధ్యంలో ఇక ఈ ఏడాది బ్రహ్మోత్సవ బహుమానం టీటీడీ ఉద్యోగులకు లేనట్లే అనుకోవాలా అనే సందేహాలు ఉన్నాయి. మరి ఈ నిర్ణయం తాత్కలికమా? లేక శాశ్వత ప్రాతిపదికన నిలుపుదల చేస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd