తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చే కానుకలు, ఇతరత్రా వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం బాండ్లలో పెట్టుబడులు పెడుతోందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ స్పందించింది. టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. టీటీడీ ఇకపై బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడాన్ని కొనసాగిస్తుందని తెలియజేసింది. ‘ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను టీటీడీ ధర్మకర్తల మండలి లోతుగా అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక అంశాన్ని ఐచ్ఛికంగా మాత్రమే పరిగణలోకి తీసుకుంది. అంతేగానీ, ఇందులో ఎలాంటి రహస్య అజెండా లేదు. టీటీడీ బోర్డు ఎంతో పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించడం జరిగింది. అదే విధంగా బోర్డు తీర్మానాన్ని టీటీడీ వెబ్ సైట్ లోనూ అప్ లోడ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అంశం కొత్తగా తీసుకున్నది కాదు. ఇదివరకే 1987 దేవాదాయ శాఖ చట్టం 30లోని సెక్షన్111(3), జి.ఓ 311, తేది: 09-04-1990 లోని టీటీడీ నిబంధన 80 ప్రకారం ప్రభుత్వ ఆమోదం పొందిన మార్గదర్శకాల మేరకు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ’ అని తెలియజేసింది.
అయితే, ప్రస్తుతం కేంద్రం కొత్త మార్గదర్శకాల తర్వాత బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండడంతో అందులోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో టీటీడీ పెట్టుబడులు పెట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేయడమైనది. అయితే వడ్డీ రేట్లు తగ్గుతున్నతరుణంలో టీటీడీ బోర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఈ ఐచ్ఛికాన్ని పరిగణించ వలసిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున ఇకపై బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడాన్ని టీటీడీ కొనసాగిస్తుందని తెలియజేయడమైనది.’ అంటూ ఆ ప్రకటనలో తెలిపింది.
టీటీడీకి వచ్చే నిధులను అధిక వడ్డీ కోసం రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టేలా నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తద్వారా నిధుల లేమితో కుదేలవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ సహకారం అందినట్లవుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారీ ఊరట కలిగించే అంశం. అయితే, అసలు జగన్ ప్రభుత్వం కోసమే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం జాతీయ బ్యాంకుల్లో పెట్టే పెట్టుబడులకు ఇచ్చే వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. దీంతో మెరుగైన పెట్టుబడి అవకాశాల కోసం వెతుకుతున్న టీటీడీకి ఏపీ ప్రభుత్వం కనిపించింది. జాతీయ బ్యాంకులు ఇచ్చే దాని కంటే ఎక్కువ మొత్తం వడ్డీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. దీనిపై దుమారం రేగింది. ఇదే అంశంపై స్పందించిన మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ దీనిపై వివరణ ఇస్తే బావుంటుందన్నారు. టీడీడీకి ఈ నిర్ణయం తీసుకునే అర్హత ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే టీటీడీ తమ నిధుల్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడుతోందని ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగమే అంటూ ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd